తెలంగాణకు కమ్మేస్తున్న ముందస్తు మేఘాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని నొక్కి వక్కాణిస్తున్న కేసీఆర్ మాటలకు భిన్నంగా తెర వెనుక కసరత్తు జరుగుతుందాఅంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు నాటికి.. ఇప్పుడున్న వాతావరణానికి భిన్నమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకునేలా కార్యాచరణను సీఎం కేసీఆర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ ప్లాగ్ షిప్ ప్రోగ్రాం అయిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పటికే నిర్మాణం పూర్తి అయి నెలలు గడుస్తున్నా.. వాటిని కేటాయించకుండా అట్టే ఉంచేయటం తెలిసిందే.ఇప్పుడువాటిని ఇవ్వటంతో పాటు.. పూర్తి చేయాల్సిన వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. దళితబంధు పథకాన్ని కూడా అమలు చేయటం.. వేలాది పోస్టులకు నోటిఫికేషన్లుజారీ చేసి పోస్టుల భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం వైఖరిని తూర్పార పట్టటంతో పాటు.. మోడీ సర్కారు కారణంగా తెలంగాణ ప్రభుత్వం నష్టపోతున్న అంశాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడనున్నట్లు చెబుతున్నారు.మరోవైపు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల పర్యటనను పూర్తి చేయాలని.. అవసరానికి తగ్గట్లు బహిరంగ సభల్ని నిర్వహించటం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత పెరిగేలాచేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.సంక్షేమ పథకాలకు సంబంధించి మార్చిని తుది గడువుగా పెట్టుకోవటంతో పాటు.. సెక్రటేరియట్.. భారీ అంబేడ్కర్ విగ్రహం.. అమరవీరుల స్తూపం ఇలాంటి వాటిని వేగంగా పూర్తి చేయటం ద్వారా..  ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.తాము అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే.. మార్చి చివర్లో ప్రభుత్వాన్ని రద్దు చేయటం ద్వారా.. షెడ్యూల్ కు కాస్తంత ముందు ఎన్నికలు జరిగేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంత త్వరగా ఎందుకు అంటే.. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బాగుంటుందని.. అలా కాకుండా కర్ణాటక ఎన్నికల తర్వాత ఎన్నికలకు వెళితే.. కొత్త ఇబ్బందులు ఎదురుకావచ్చన్న ఆలోచనలో గులాబీ అధినేత ఉన్నట్లు చెబుతున్నారు.

చెప్పేది చేయకపోవటం.. చేసేది చెప్పకపోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. కాస్తంత గుర్తుకు తెచ్చుకుంటే.. ఈ మధ్యనే గులాబీ ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. ఇక రోజు కలుస్తాం కదా‘ అంటూ మీడియా వారికి చెప్పేసి.. లోపలకు వెళ్లిపోయారు. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టింది లేదు.. మీడియా ప్రతినిధులు అడగాల్సినవేమీ అడిగే పరిస్థితి లేదు. అలా తాను చెప్పిందేదీ చేయకుండే విషయంలో సీఎం కేసీఆర్ తీరు కాస్త భిన్నమని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే.. తెలంగాణ దిశగా ముందస్తు మేఘాలు దట్టంగా కమ్ముకొస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందన్నది కాలమే నిర్ణయించాలి.

Leave A Reply

Your email address will not be published.