నిజాం విముక్త పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి

.. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు యువత సరైన దృక్పథంతో ముందుకు సాగాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. నిజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని బిఎల్ ఎన్ గార్డెన్ లో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 3000 మంది యువతీ,యువకులు ఈ సమ్మేళనంలో పాల్గొనగా ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ వాసుజీ, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ లు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్ర, నిజాం విముక్త పోరాట స్ఫూర్తి గాధలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని, అలాంటి అమరవీరుల చరిత్ర నేటి యువత తెలుసుకోవాలన్నారు. విద్యతోపాటు దేశభక్తి, సామాజిక స్పృహ కలిగి ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు.1947 ఆగస్టు,15 న దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగి ఉండగా నిజాం పాలన లోని తెలంగాణ ప్రాంతం రజాకర్ల అకృత్యాలకు బలిఅయిందన్నారు. అత్యంత క్రూరంగా మహిళలను మానభంగం చేయడమే కాకుండా నిజాముకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యువకులను అత్యంత పాశవీకంగా చంపారని తెలిపారు. నిజాం కు వ్యతిరేకంగా గొంతు విప్పిన కవులు, కళాకారులను సైతం రజాకర్ మూకలు విడిచిపెట్టలేదని తెలిపారు.రాజాకర్లకు వ్యతిరేకంగా కథనాలు రాసిన ఇమెరాజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ చేతులు నరికి హత్య చేశారన్నారు.దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమురం భీం, నారాయణరావు పవార్ లాంటి ఎందరో పోరాట యోధులు నిజాం పాలన నుండి హైదరాబాదు రాష్ట్రాన్ని విముక్తం చేయడం కోసం పోరాడి ప్రాణాలర్పించారన్నారు. అలాంటి వీరుల చారిత్రక గాధలను నేటి యువత తెలుసుకోవాలన్నారు. నైజాం పాలన అంతమైనప్పటికీ నేటికీ కూడా కొంతమంది నిజాం వారసుల రూపంలో తెలంగాణ లో మళ్ళీ నిజాం పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్పీ సుబ్రహ్మణ్యం, మల్లోజుల కిషన్ జి, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలకులు డాక్టర్ భీమనోత్ని శంకర్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, సి ఏ నిరంజనాచారి, రాధా కిషన్, తౌటు రామచంద్రం, ఆకు రాజేందర్, సంతోష్ ఆచార్య, గౌతమి, రమ, నాగరాజు వివిధ కళాశాల విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వాల్మీకి ఆవాసం, భగిని నివేదిత ఆవాసం, గీతా విద్యాలయం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

Leave A Reply

Your email address will not be published.