రైతులకు శుభవార్త .. కొయ్యకాళ్లను కాల్చకండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  హార్వెస్టర్ల (యంత్రాల) సహాయంతో పంటను కోయడంతో చేనులో కొయ్యకాళ్లు ఎత్తుగా మిగిలిపోతున్నాయి. దీంతో వాటిని కాల్చి వేస్తున్నారు రైతులు. నిప్పు పెట్టిన సందర్భాల్లో గాలి వస్తే పొలాల్లో మంటలు చెలరేగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు సందర్భాల్లో రైతులు ఊపిరి మంటల్లో కలిసిపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటీవల వరి కొయ్యలను కాలుస్తున్న క్రమంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. అవగాహన లోపంతోనే రైతులు వరికొయ్యలు కలుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొయ్యలను కాల్చడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు బొప్పాపూర్, గొల్లపల్లి, వెంకటాపూర్, హరిదాస్ నగర్, పదిర, రాజన్నపేట, తిమ్మాపూర్, గుండారం గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటను కోసి ధాన్యం విక్రయించారు. యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. పొలాల్లోని వరి కొయ్యలను తగులబెడుతున్నారు. గాలి తీవ్రంగా వీస్తుండడంతో చుట్టు పక్కల మంటలు వ్యాపిస్తున్నాయి. అదుపు చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల వెంకటాపూర్ లోని రైతు పర్శరాములు గౌడ్ కు చెందిన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను కాల్చేం దుకు కూలి పనులకు వెళ్లిన అదే గ్రామంలోని వ్యవసాయ కూలీ మంద రాంరెడ్డి మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు. బొప్పాపూర్ లోని రాజిరెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలను కాలుస్తున్న క్రమంలో మంటలు భారీ స్థాయిలో ఎగిసి పడ్డాయి. దీంతో చుట్టూ ఉన్న వ్యవసాయ పొలాలకు వ్యాపించాయి. విలువైన వ్యవసాయ మోటార్లు, వైర్లు, పశు గ్రాసం దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లింది. నారాయణపూర్ లో రాజయ్య వరి కోత పట్టి పొలంలో మిగిలిపోయిన కొయ్యకాళ్లను కాల్చేందుకు సిద్ధమయ్యాడు. కాల్చి చుట్టు పక్కలకు మంటలు వ్యాపించకుండా కాపలా ఉన్నా..మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. పొగకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అస్వస్థతకు గురయ్యాడు. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

.. వ్యవసాయ శాఖా అధికారుల సూచనలేమిటంటే

‘వరి కొయ్య కాళ్లను కాల్చకూడదు. కాల్చితే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. పొలంలో నీళ్లు ఉంచి దున్ని కుళ్లిపోయేలా చేసి, నాటుకు 3 వారాల ముందు పొలంలో కొయ్య కాళ్లు కుళ్లిపోవడానికి ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లుకోవాలి. కాల్చడంతో భూసారం దెబ్బతింటుంది. రైతులకు అవగాహన కల్పించినా మార్పు రావడం లేదు. కొందరు రైతులు వరి కొయ్యలను కాల్చడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.’ అని ఎల్లారెడ్డిపేట మండలం ఏవో భూమారెడ్డి చెప్పారు. అయితే, దీనిపై రైతులకు అధికారులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందనే చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.