తీవ్ర వాయుగుండంగా మారిన మాండూస్‌ తుపాను

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్‌ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తున్న మాండూస్‌ తుపాను.. శనివారం మధ్యాహ్నానికి మరింతగా బలహీనపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. కాగా, తుపాను తీరం దాటే సమయంలో తమిళనాడులోని చెన్నై సహా చెంగల్‌పట్టు, విల్లుపురం, కాంచీపురం, కరైకల్‌, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ గాలులకు పలు ప్రాంతాల్లోని భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క చెన్నై నగరంలోనే దాదాపు 200కిపైగా చెట్లు నేలకూలినట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు మాండూస్‌ తుపాను కారణంగా చెన్నై, చెంగల్‌పట్టు, కరైకల్‌, మహాబలిపురం, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. చెన్నై టీ-నగర్‌లో గోడ కూలడంతో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తుపాను నేపథ్యంలో చెన్నై తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.