జనసంద్రంగా మారిన శబరిగిరులు

- పంబ నుంచి 6 కి.మీ. మేర క్యూ లైన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:   కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు భక్తులతో కిక్కిరిశాయి. దిగువ పంబ నుంచి సన్నిధానం వరకూ ఆరు కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో నిండిపోయింది. అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గత కొద్ది రోజుల నుంచి రోజుకు లక్ష మంది దర్శనం కోసం వస్తున్నారు. శనివారం లక్ష, ఆదివారం 1.10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అనూహ్యంగా స్వాముల రద్దీ పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. క్యూలైన్‌లో చిక్కుకున్న చిన్నారులను పోలీసులు సురక్షిత ప్రదేశాలకు చేర్చుతున్నారు.

శబరిమలలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం అత్యవసరంగా అత్యున్నత స్థాయి సమావేశానికి ఆదేశించారు. రద్దీ నియంత్రణ, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. అటు, భక్తుల రద్దీ నియంత్రణ, ఏర్పాట్ల విషయంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు, పోలీసుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. దీంతో భక్తుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

నివేదికల ప్రకారం.. పోలీసులు అమలు చేసిన ‘పవిత్ర పుంగావనం’ ప్రాజెక్ట్ స్థానంలో ‘పవిత్రం శబరిమల’ అనే కొత్త ప్రాజెక్ట్‌తో టీబీడీ తీసుకున్న నిర్ణయం పోలీసులను నిరాశకు గురిచేసింది. త్రివేణి సమీపంలోని పంబా వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసిన తర్వాత టీడీబీ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ప్రస్తుతం పదినెట్టాంబడిలో భక్తులకు దర్శన సౌలభ్యం కోసం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో 10 మంది పోలీసుల బృందం విధులు నిర్వహిస్తోంది. నిమిషానికి 90 మంది యాత్రికులను అనుమతించాలని భావించినప్పటికీ, భారీ రద్దీ నెలకున్న తర్వాత కూడా నిమిషానికి 70 కంటే తక్కువ మందిని మాత్రమే అనుమతిస్తున్నారు.

అయితే, పోలీసులు మాత్రం పదునెట్టాంబడి నుంచి సాధారణ రోజుల్లో నిమిషానికి 60 మందిని అనుమతించామని.. రద్దీ సమయంలో 80 మందిని విడిచిపెడుతున్నామని అంటున్నారు. అంతేకాదు, విర్చువల్ క్యూ బుకింగ్ టిక్కెట్‌లను కుదించాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. టీడీబీ రోజుకు 1.2 లక్షల టిక్కెట్లు మంజూరు చేస్తోంది. ఒకవేళ రోజూ లక్ష మందికిపైగా భక్తులు వస్తే వాహనాలకు పార్కింగ్ సమస్యగా మారుతుందని పోలీసులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.