Fact Check: ప్రధాన మంత్రి ముద్ర యోజన రుణం కావాలంటే రూ.2వేలు చెల్లించాలా..? ఇందులో నిజమెంత? ఇదిగో క్లారిటీ

PM-Mudra-Yojana.jpg

దేశంలో మోడీ సర్కార్‌ ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ పథకాలను రూపొందిస్తూ ప్రజలకు చేరువయ్యేలా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ ప్రవేశపెట్టిన కొన్ని పథకాల్లో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా వివిధ రకాల లింకులు, పోస్టులు పెడుతూ వినియోదారులకు ఎర వేస్తున్నారు. వాటిని నమ్మిన వారు ఆ లింకులను ఓపెన్‌ చేయగానే వారి వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇంకే ముంది వారి బ్యాంకు అకౌంట్లు ఖాలీయే.

గతంలో కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో ప్రజలకు సహాయం చేయడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ పథకాన్ని తీసుకువచ్చింది. దీని కింద ప్రజలకు రుణాలు అందజేస్తుంది. ఈ పథకం కింద, మీరు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు వ్యాపార రుణం తీసుకోవచ్చు. ఈ పథకం యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’ కింద రూ.10 లక్షల వరకు గ్యారెంటీ లేని రుణం కావాలంటే రుసుముగా రూ.2,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సోషల్‌ మీడిలో ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. ప్రభుత్వం ఈ రుసుమును లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫీజుగా తీసుకుంటోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ వైరల్ క్లెయిమ్‌ను తనిఖీ చేసింది. వైరల్‌ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా అబద్దమని పీఐబీ గుర్తించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణం తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి రుసుమును వసూలు చేయదని, ఈ వార్త పూర్తిగా నకిలీదని ఫాక్ట్‌ చెక్‌ వివరించింది.

Leave A Reply

Your email address will not be published.