లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 240 పాయింట్ల లాభంతో 62,774 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 66 పాయింట్లు లాభపడి 18,674 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ (Sensex) 30 సూచీలో విప్రో, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎల్అండ్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, హెచ్ యూఎల్, ఐటీసీ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. అమెరికాలో ధరలు వరుసగా ఐదో నెలా తగ్గుముఖం పట్టాయి. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబరులో 7.1 శాతంగా నమోదైంది. దీంతో అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా పసిఫిక్ సూచీలు నేడు లాభాలతో కొనసాగుతున్నాయి. అయితే, రెండు రోజుల వరుస లాభాల నేపథ్యంలో సూచీలు నేడు గరిష్ట స్థాయిలకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ పీపా ధర మరోసారి 80 డాలర్లకు చేరువైంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న తరుణంలో చమురు ధరలు మళ్లీ పెరగడం మార్కెట్లకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వన్97 కమ్యూనికేషన్స్: పేటీఎం బ్రాండ్వ కార్యకలాపాలు సాగిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ రూ.850 కోట్ల షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. ఒక్కో షేరును రూ.810 చొప్పున కొనుగోలు చేయనుంది. బీఎస్ఈలో మంగళవారం షేరు ముగింపు ధర రూ.539.5తో పోలిస్తే ఇది 50 శాతం అధికం. పన్నులతో కలిపి బైబ్యాక్ కోసం కంపెనీ రూ.1048 కోట్లు వెచ్చించనుంది.

యెస్ బ్యాంక్: యెస్ బ్యాంకులో ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కార్లిలే గ్రూప్, అడ్వెంట్ 9.99 శాతం వాటాలను కొనుగోలు చేశాయి. రూ.8,869 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి. వేదాంతా: దేశీయంగా సెమీకండక్టర్, టీవీల తెర (డిస్ప్లే) తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి 30 జపాన్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వేదాంతా గ్రూప్ ప్రకటించింది.

టాటా మోటార్స్: వచ్చే జనవరి నుంచి తమ అన్ని వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం వెల్లడించింది. ఎస్బీఐ: రూ.2 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లను 15-65 బేసిస్ పాయింట్ల మేర . పెంచింది. రూ.2 కోట్లకు మించిన బల్క్ డిపాజిట్లపై 50- 100 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.