కల్తీ మద్యం మరణాలపై నితీశ్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీహార్: బిహార్‌‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. అయితే, కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం కలకలం రేగుతోంది. తాజాగా ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగిన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై రెండు రోజులుగా బిహార్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ‘తాగేసి వచ్చారా?’ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై బుధవారం విరుచుకుపడ్డారు. తాజాగా, ఇదే అంశంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకవేళ తాగితే చస్తారు’’ అని నితీశ్ నోరు జారారు.

కల్తీ మద్యం ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 39కు చేరుకోగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ‘‘గతసారి కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే పరిహారం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు.. మద్యం తాగితే ఎవరైనా చనిపోతారు.. దానికి ఉదాహరణ మన ముందు ఉంది.. దీనిపై సంతాపం తెలియజేస్తూ ఆయా ప్రదేశాలను సందర్శించి ప్రజలకు వివరించాలి.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.. మద్యపానం మన రాష్ట్రంలో నిషేధించాం.. కొందరు అమ్ముతున్న కల్తీ మద్యం తాగి జనాలు చనిపోతున్నారు.. మద్యం చాలా ప్రమాదికారి.. కాబట్టి దానిని సేవించరాదు’’ అని అన్నారు.

‘‘పేదలను పట్టుకోవద్దని అధికారులకు చెప్పాను.. మద్యం తయారీ, మద్యం వ్యాపారం చేసే వారిని పట్టుకోవాలి.. ప్రజలు ఏదైనా పనిని ప్రారంభించడానికి రూ. 1 లక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.. అవసరమైతే మేము మొత్తాన్ని సేకరిస్తాం కానీ ఈ వ్యాపారంలో ఎవరూ పాల్గొనకూడదు’’ అని నితీశ్ పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే నిర్ణయం తీసుకున్నామని సమర్దించుకున్నారు.

బిహార్‌లో 2016 ఏప్రిల్‌ నుంచే సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఛాప్రా ఘటనపై బిహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం నిరసన చేపట్టారు. ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సీఎం నీతీశ్ కుమార్‌ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘ఏం జరుగుతోంది? గొంతు చించుకోవద్దు.. తాగి అసెంబ్లీకి వచ్చారా? మీరు చేస్తున్నది సరైంది కాదు. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు’’ అని నితీశ్ హెచ్చరించారు. దీంతో అసహనానికి గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.