షికారు కొరకు వెళ్లి .. రాళ్ల మధ్యలో?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో షికారు (వేట) కోసం వెళ్లిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. బండరాళ్ల మధ్య పడిపోయి ఇరుక్కుపోయాడు. 24 గంటల తర్వాత అతడిని గుర్తించి, రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పెద్ద బండరాళ్ల మధ్య లోతైన రంధ్రంలో పడిపోయిన అతడిని బయటికి తీసుకురావడం కత్తి మీద సాములా మారింది. పోలీసులు ప్రొక్లెయినర్, ఫైరింజన్‌ను తీసుకొచ్చారు. అయితే, అతడిని ఎలా బయటికి తీయాలనేది చిక్కు ప్రశ్నగా మారింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు (38) మంగళవారం (డిసెంబర్ 13) సాయంత్రం వేట కోసం అడవి వైపు వెళ్లాడు. ఘన్‌పూర్ తండా మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా.. ఓ చోట రాళ్ల గుట్టపై ఏదో జంతువు కనిపించినట్లు అనిపించింది. ఆ రాళ్లపైకి వెళ్లి వెతుకుతున్న సమయంలో తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ జారిపోయి రాళ్ల మధ్యలో పడిపోయింది. ఆ ఫోన్‌ను అందుకునే క్రమంలో రాజు.. రాళ్ల మధ్యలో ఉన్న గుహలో పడిపోయాడు. లోతైన రంధ్రంలో పడిపోయి, బయటకు వచ్చే అవకాశం లేక, ఆర్తనాదాలు చేస్తూ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు.

రాజు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అడవంతా గాలించారు. బుధవారం మధ్యాహ్నం రాళ్ల మధ్యలో నుంచి అరుపులు రావడంతో అటు వైపు వచ్చి చూశారు. రాళ్ల మధ్యలో రాజు పడిపోయినట్లు గుర్తించి, గ్రామస్థుల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ రంధ్రం ద్వారా రాజుకు తొలుత మంచినీళ్లు, ఓఆర్‌ఎస్ అందించారు. ఆ తర్వాత బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం జేసీబీ, ఫైరింజన్‌ను అక్కడికి రప్పించారు. ఈలోగా చీకటి పడటం సహాయ కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్న రాజును బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.