ఎన్నికల ప్రవర్తనా నియమావళి లో మార్పులు:కేంద్ర ఎన్నికల కమిషన్

కేంద్ర ఎన్నికల కమిషన్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పాటించవలసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి లో మార్పులు తేవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరింది. ఎన్నికల ప్రణాళికలలో పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, వాటి కోసం అయ్యే ఖర్చు విషయంలో సందిగ్ధత, అస్పష్టతలను తొలగించేందుకు ఈ చొరవ తీసుకుంది. ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలు పారదర్శకంగా, ప్రజలకు అన్ని విషయాలు తెలిసే విధంగా ఉండేలా చూడాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్గదర్శకాలను సవరించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. దీని కోసం ఓ స్టాండర్డయిజ్డ్ ప్రొఫార్మాను జత చేయాలని ప్రతిపాదించింది. గుర్తింపు పొందిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు మంగళవారం ఈ మేరకు ఓ లేఖ రాసింది. ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఎన్నికల ప్రణాళికలలో చేసే వాగ్దానాల హేతుబద్ధత, వాటిని అమలు చేయడం కోసం నిధులు అందుబాటులో ఉండటం గురించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వివరణ ఇవ్వాలని ప్రస్తుత ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్గదర్శకాలు చెప్తున్నప్పటికీ, పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రకటనలు యథాలాపంగా, మామూలుగా, సందిగ్ధతతో ఉంటున్నట్లు గమనించినట్లు తెలిపింది. ఎన్నికల్లో అన్ని విషయాలు తెలుసుకుని, దాని ఆధారంగా ఓ అభ్యర్థిని ఎన్నుకునేందుకు నిర్ణయం తీసుకోవడానికి తగిన సమాచారాన్ని ఈ ప్రకటనలు ఓటర్లకు అందజేయడం లేదని గుర్తించినట్లు తెలిపింది.ఎన్నికల బరి అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమాన అవకాశాలు పొందగలిగే విధంగా ఉండటంపైనా, స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా ఎన్నికలను నిర్వహించడంపైనా అవాంఛనీయ ప్రభావాన్ని కొన్ని వాగ్దానాలు, ఆఫర్లు చూపిస్తూ ఉంటే, మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోకూడదని నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదిత సవరణలపై అభిప్రాయాలను ఈ నెల 18నాటికి తెలియజేయాలని గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను కోరింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్గదర్శకాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా ఆ పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి నిధుల లభ్యత గురించి ఓటర్లు అంచనా వేసుకోవడానికి అధికారిక సమాచారం ఇవ్వడానికి వీలవుతుందని తెలిపింది. వాగ్దానాల స్వభావం గురించి కచ్చితంగా మదింపు చేయడం సాధ్యమవుతుందని తాను విశ్వసించడం లేదని కమిషన్ పేర్కొంది. అయితే ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు సమీప భవిష్యత్తులోనూ, సుదూర భవిష్యత్తులోనూ ఆ వాగ్దానాల అమలు వల్ల ఎదురయ్యే ఆర్థిక పర్యవసానాలపై ఆరోగ్యకరమైన చర్చను ప్రోత్సహించడం తప్పనిసరి అని తెలిపింది. అందుకే ఆ వివరాలను వెల్లడించడం కోసం ఎన్నికల ప్రవర్తన నియమావళిలో మార్పులు చేయవలసిన అవసరం ఉన్నట్లు తెలిపింది. వాగ్దానాల అమలు కోసం నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు? అదనంగా పన్నులు విధించడం వంటి చర్యలు తీసుకుంటారా? ఖర్చులను హేతుబద్ధం చేయడం కోసం కొన్ని పథకాల్లో కోత విధిస్తారా? ఎఫ్ఆర్‌బీఎం పరిమితులపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది? మరిన్ని అప్పులను తీసుకొస్తారా? వంటి వివరాలను రాజకీయ పార్టీలు ఈ స్టాండర్డయిజ్డ్ ప్రొఫార్మా ద్వారా తెలియజేయాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. ఈ వాగ్దానాన్ని అమలు చేస్తే లబ్ధి పొందేవారు ఎవరు? ఉదాహరణకు, వ్యక్తులు, కుటుంబాలు, కులాలు, మతాలు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు, లేదా, మొత్తం జనాభా? వాగ్దానాల అమలుకు ఎంత ఖర్చవుతుంది? ఆర్థిక వనరుల లభ్యత, వాగ్దానాల అమలుకు అదనపు ఖర్చు కోసం వనరులను ఏ విధంగా సేకరిస్తారు? అదనపు వనరుల సేకరణ వల్ల రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సుస్థిరతపై పడే ప్రభావం ఏమిటి? వంటి వివరాలను ఈ ప్రొఫార్మాలో తెలియజేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలో తాజా ఆర్థిక పరిస్థితి గురించి వెల్లడించాలని కూడా ప్రతిపాదించింది.

Leave A Reply

Your email address will not be published.