మరణదిన వేడుకలకు ఆహ్వాన పత్రిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాపట్ల: మరణ దిన వేడుకలు.. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. ఓ మాజీ మంత్రి ముందుగానే తనకు మరణం ఎప్పుడొస్తుందో ఊహించుకొని.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకుని అందరికి షాకిచ్చారు. మరణ దినం పేరుతో ఏకంగా ఆహ్వాన పత్రికల్ని సిద్ధం చేశారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు (Paleti Rama Rao) వ్యవహారంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ విచిత్రమైన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.పాలేటి రామారావు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాదు రెండుసార్లు ఎమ్మెల్యే కూడా.. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌సీపీ (YSRCP)లో ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 63 ఏళ్లు.. అయితే 75 ఏళ్ల వయసులో అంటే 2034 లో చనిపోతానని ముందుగానే అంచనా వేసుకున్నారు. అందుకే ఈ ఏడాది నుంచి ‘మరణ దినం’ చేసుకుంటున్నట్లు ఆహ్వాన పత్రికను ముందుగానే ముద్రించుకున్నారు. తన మరణానికి ఇంకా 12 ఏళ్లు ఉన్నాయని భావించి.. శనివారం చీరాల ఐఎంఏ హాలులో 12వ ‘మరణ దినం’ పేరిట వేడుకలకు సిద్ధమయ్యారు. మనిషి మరణ భయం అధిగమించి.. ఇప్పటి వరకు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఇలాంటి వేడుకలు అవసరమని.. అందుకే తొలిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది 11వ వేడుకలూ చేస్తానంటున్నారు. ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave A Reply

Your email address will not be published.