నేడు శీతాకాల విడిదికోసం నగరానికి వస్తున్న రాష్ట్రపతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికోసం ఈ నెల 26న నగరానికి వస్తున్నారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 30వ తేదీ వరకు రాష్ట్రపతి బస చేయనున్నారు. ఆమె విడిది కోసం రాష్ట్రపతి నిలయాన్ని శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నిలయంలో 6 భవనాలు, వెలపల ఉన్న 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలను, ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపర్చారు. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. విషసర్పాలు, కీటకాలు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పటికే రాష్ట్రపతి నిలయం పరిసరాలను తమ అధీనంలోకి తీసుకుంది.భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. బొల్లారం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. అలాగే, రాష్ట్రపతి విడిది చేయనున్న నేపథ్యంలో హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌-సికింద్రాబాద్‌- రాష్ట్రపతి నిలయం- రాజ్‌భవన్‌ మార్గాల్లో శనివారం సుమారు 40 కార్లు ఉన్న కాన్వాయ్‌తో రూట్‌ కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు రిహార్సల్స్‌ను పరిశీలించారు. హకీంపేట్‌ నుంచి రాష్ట్రపతి నిలయం – సికింద్రాబాద్‌ వరకు అడుగడుగునా పేలుడు పదార్థాల నిపుణులు పోలీసు జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హకీంపేట విమానాశ్రయాన్ని అధికారులతో కలిసి మేడ్చల్‌-మల్కాజిగిరి ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.