మళ్లీ టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో ఎన్నికలకు కేవలం ఏడాదికిపైగా మాత్రమే సమయం ఉండటంతో  ఆదినారాయణరెడ్డి మళ్లీ టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం జమ్మలమడుగులో టీడీపీకి అభ్యర్థి లేకుండా పోయారు. గతంలో రామసుబ్బారెడ్డి రూపంలో గట్టి అభ్యర్థి టీడీపీకి ఉండేవారు. అయితే రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం తీసుకున్నారు. దీంతో ఆదినారాయణరెడ్డి రాకకు పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. త్వరలోనే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరొచ్చని టాక్ నడుస్తోంది.కడప జిల్లా రాజకీయాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే కీలక నియోజకవర్గాల్లో ఒకటి.. జమ్మలమడుగు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గం వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆసక్తి రేకెత్తిస్తోంది.ప్రస్తుతం జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డే పోటీ చేసే అవకాశం ఉంది.. లేదంటే ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయొచ్చని అంటున్నారు.కాగా జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 2009ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014లో వైసీపీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. అంతేకాకుండా మంత్రిగానూ పనిచేశారు.ఇక 2019లో టీడీపీ తరఫున కడప ఎంపీగా పోటీచేసిన ఆదినారాయణరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతగానే ఉన్నారు.అయితే రాయలసీమలో బీజేపీకి కనీస ఓటు బ్యాంకు కూడా లేకపోవడంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగినా గెలుపొందడం కష్టమనే భావనలో ఆదినారాయణరెడ్డి ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందులోనూ ఈసారి జనసేనటీడీపీ పొత్తు కుదిరే అవకాశం కూడా కనిపిస్తుండటంతో టీడీపీలోకి వస్తే సులువుగా గెలుపొందడం ఖాయమనే భావనలో ఆదినారాయణరెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదట ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ఆయనపైనే ప్రధానంగా అభియోగాలు మోపింది. అయితే ఆది ఈ అభియోగాలను తీవ్రంగా ఖండించారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ చేశారు. అంతేకాకుండా వైఎస్ వివేకా హత్యను కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారించాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.కాగా 2014లో వైసీపీ తరఫున జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి తర్వాత పార్టీ ఫిరాయించి టీ డీపీలో చేరి మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉండటంతోనే బీజేపీలో చేరారని చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తనకు వైసీపీ ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో బీజేపీలో చేరారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.