కరోనాపై ‘భారత్’ కలతచెందాల్సిన అవసరం లేదు!

- భారత సుదర్శన్, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: పొరుగుదేశమైన చైనాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రపంచ దేశాలు మళ్లీ కలవరపడుతున్నాయి. గతంలో కరోనా వైరస్ చైనా నుంచే వ్యాపించందనే వార్తలున్న నేపథ్యంలో ప్రపంచదేశాల్లో ఆందోళన చెలరేగడం సహజమే. ఇదే సందర్భంలో చైనాతో సరిహద్దును కలిగివున్న మన దేశంలో కూడా ఒకింత ప్రభావం ఉంటుందని అందరూ భావిస్తూ వస్తున్నారు. నిజానికి చైనాలో కరోనా మళ్లీ విజృంభించడానికి ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలే కారణంగా తెలుస్తున్నది. చైనాలో కరోనాను కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం వైఫల్యం చెందడంతో, ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టినట్లుగా వార్తలు అందుతున్నాయి. చైనాలో అవలంభించిన జీరో కోవిడ్ పాలసీని కఠినంగా అమలు చేసేందుకు జిన్ పింగ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను అవలంభించేందుకు ప్రయత్నించడమే అక్కడ ప్రస్తుతమున్న పరిస్థితికి కారణమని పలువురు అంతర్జాతీయ వైద్య, సామాజిక, రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయపడుతుండటం గమనార్హం. ప్రజాగ్రహానికి తలొగ్గి జిన్ పింగ్ ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీపై వెనుకంజ వేసింది.

భారత్ కు ఆందోళన అవసరం లేదు :

దేశంలో మరో కరోనా వేవ్ రాకపోవచ్చని పలు జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా కరోనా వైరస్ సోకడంతో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి వచ్చినట్లైందంటున్నారు. దేశంలోని 90% జనాభాకి సహజ నిరోధకత వచ్చిందనే విషయాన్ని ఐఐటి కాన్పూర్ మోడల్ సూత్రం కూడా స్పష్టం చేసింది. కొత్త వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లుగా వస్తున్న వార్తలపై విభిన్న కథనాలున్నాయి. చైనాలో వచ్చిన బిఎఫ్.7 అనే వేరియంట్ జూలై నుంచే మన దేశంలో ఉన్నట్లుగా పలువురు డాక్టర్లు స్పష్టం చేశారు. వైరస్ మ్యుటేషన్ లో వచ్చిందే కానీ చైనా లేదా ఇతర దేశాల నుంచి వచ్చింది కాదని పలువురు వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. బిఎఫ్.7 వేరియంట్ పై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ వేరియంట్ భారత ప్రజలకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించదంటున్నారు. అయితే ఎల్లప్పుడూ ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకుండా చూసుకుంటూ ఫేస్ మాస్క్ లను ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే భారత్ లో కన్పించిన మూడు వేవ్ లు సహజంగానే లక్షలాది మందికి రోగనిరోధక శక్తిని ఇచ్చినవని వారు తెలియజేస్తున్నారు. చాలా మంది భారతీయులు హైబ్రిడ్ రోగనిరోధక శక్తిని పొందారు. అంటే వ్యాక్సిన్‌ల ద్వారా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందని, వివిధ కోవిడ్ వేరియంట్‌ల నుండి వారిని రక్షించే సహజ సంక్రమణం లభించిందని అంతర్జాతీయ వైద్య నిపుణులు స్పష్టం చేస్తుండటంతో భారత్ కు ఎంతో ఊరట కలిగింది. భారత ప్రజలు కొత్త వేరియంట్ల పట్ల తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలియవస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.