రకరకాల విచిత్ర వేషధారణలతో భంగి….రూటే సపరేటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భంగి అనంతయ్య గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టీడీపీ నాయకుడిగా కర్నూలు నగర మేయర్ గా గతంలో ఆయన పనిచేశారు. ఆ సమయంలో రకరకాల విచిత్ర వేషధారణలతో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. టీడీపీకి మద్దతుగా.. అలాగే ఆ పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లోనూ మహిళగా కుష్టువాడిగా కార్మికుడిగా రిక్షా కార్మికుడిగా బిక్షగాడిగా పగటి వేషగాడిగా ఇలా అనేక రూపాల్లో బంగి అనంతయ్య కనిపిస్తూ ఉండేవారు. తద్వారా నిత్యం మీడియాలో కనిపిస్తుండేవారు.అయితే ఆ తర్వాత నుంచి అంటే గత ఐదేళ్లుగా ఆయన రాజకీయంగా చాలా సైలెంట్ అయ్యారు. ఆయన గురించి ప్రజలు కూడా నిదానంగా మర్చిపోయారు. మళ్లీ ఇంతలో ఇప్పుడు ఆయన తాజాగా ప్రజల ముందు ప్రత్యక్షమయ్యారు.తాజాగా కర్నూలు నగరంలో జనవరి 1న జరిగిన ఓ కార్యక్రమంలో అనంతయ్య వింత వేషధారణతో వార్తల్లో నిలిచారు. అయితే అది నిరసన ర్యాలీ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా పాదయాత్ర చేశారు.జగన్ ప్రభుత్వం జనవరి నుంచి పింఛను రూ.2500 నుంచి రూ.2750కి పెంచిన సందర్భంగా అనంతయ్య పాదయాత్ర చేపట్టారు.అనంతయ్య మహిళా వేషధారణతో చీర కట్టుకుని జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాన్ని తలపై పెట్టుకుని కర్నూలు కలెక్టరేట్ వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు జీవితాంతం కృతజ్ఞతలు తెలుపుతారన్నారు.కాగా టీడీపీ హయాంలో కూడా అనంతయ్య 2018లో ఇదే తరహా ర్యాలీలో పాల్గొన్నారు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల రుణమాఫీ రూ.42000 కోట్ల రుణమాఫీ వంటి మహిళా ఆధారిత పథకాలను అమలు చేసిన నాటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును కొనియాడుతూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పాటలకు నృత్యాలు చేస్తూ మహిళా వేషధారణలో అప్పట్లో కనిపించారు.ఇలా టీడీపీకి గట్టి మద్దతుదారుగా ఉన్న బంగి అనంతయ్యకు 2014కు ముందు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ టిక్కెట్టు నిరాకరించడంతో  టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ టీడీపీలోకి వచ్చారు. 2019లో ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. అయినా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. సమైక్య ఆంధ్ర ఉద్యమం ధరల పెరుగుదల ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమం వంటి అనేక ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. అయినా రాజకీయంగా ఆయనకు ఎలాంటి గుర్తింపు రాలేదు.

Leave A Reply

Your email address will not be published.