మరోసారి దుర్గమ్మ గుడి వ్యవహారం వివాదాస్పదం

- అమ్మవారి మూల విరాట్ వీడియోలు వైరల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇప్పుడు ఇదే కోవలో మరోసారి దుర్గమ్మ గుడి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎవరో వ్యక్తులు గర్భగుడిలోని మూలవిరాట్ ను వీడియో తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో దుర్గమ్మ గుడిలో భద్రత కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. విచారణలో ఇది డిసెంబర్ 22న తీసిన వీడియో అని స్పష్టమైంది.వాస్తవానికి కనకదుర్గ ఆలయంలోనికి సెల్ ఫోన్లు తీసుకువెళ్లడం నిషేధం. దర్శనానికి వెళ్లబోయే ముందు ఆలయం వెలుపల ఉన్న కౌంటర్ల వద్దే సెల్ ఫోన్లను భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. కొండపైకి వెళ్లడానికి ముందే ఆలయం క్రిందనే మొబైల్ ఫోన్లను భద్రపరచడానికి ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో కూడా సెక్యూరిటీ సిబ్బంది అన్ని తనిఖీలు చేశాకే భక్తులను లోనికి అనుమతిస్తారు. సెల్ ఫోన్లు ఇతర పరికరాలు ఏమైనా లభిస్తే భక్తులను వెనుకకు పంపించేస్తారు. అలాంటిది అమ్మవారి మూల విరాట్ ను వీడియో తీయడం దాన్ని వైరల్ చేయడం వివాదాస్పదంగా మారింది.ఈ వ్యవహారంపై కనకదుర్గ ఆలయ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరో ఫోన్లతో అమ్మవారి మూల విరాట్ ను వీడియోలు తీస్తుంటే అధికారులు ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలను చూసైనా మారకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అమ్మవారి గుడిలో భద్రత లేశమాత్రమైనా లేదనేది తేటతెల్లమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఆలయ అధికారులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. డిసెంబర్ 22వ తేదీన ఒక మహిళ అమ్మవారి అంతరాలయాన్ని వీడియో తీసినట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా దుర్గ గుడి ఈవో భ్రమరాంబ దీనిపై విచారణకు ఆదేశించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించిన ఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ గుడి విజయవాడలో చాలా పాపులర్. నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాగా గతంలో దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయని అమ్మవారి వెండి సింహాసనం మాయమైందని ఇలా పలు రకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అమ్మవారి చీరల వ్యవహారం నగదు లెక్కింపులో దేవాలయ సిబ్బంది చేతివాటానికి సంబంధించి కూడా ఆధారాలు లభించాయి. దీంతో పలువురు ఉద్యోగులను విధుల నుంచి కూడా తప్పించారు.ఈ అంశాలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. 

Leave A Reply

Your email address will not be published.