ముగిసిన‌ ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌.. 1,11,209 మంది క్వాలిఫై

- 554 ఎస్సై పోస్టులకు తుది రాత పరీక్షకు 52786 మంది పోటీ - 15644 కానిస్టేబుల్ పోస్టులకు 90488 మంది పోటీ - 614 ఆబ్కారీ కానిస్టేబుళ్లకు 59325 మంది పోటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్(ఎస్ఐ), కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు గ‌తేడాది డిసెంబ‌ర్ 8న ప్రారంభ‌మైన ఫిజిక‌ల్ ఈవెంట్స్ నేటితో ముగిశాయి. అయితే ఈవెంట్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2,07,106 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కాగా, 1,11,209 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జ‌రిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే, ఇప్పుడు అద‌నంగా 5.18 శాతం మంది అభ్య‌ర్థులు క్వాలిఫై అయిన‌ట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. 554 ఎస్సై పోస్టులకు తుది రాత పరీక్షకు 52786 మంది పోటీ పడుతున్నారు. 15644 కానిస్టేబుల్ పోస్టులకు 90488 మంది పోటీ పడనున్నారు. 614 ఆబ్కారీ కానిస్టేబుళ్లకు 59325 మంది పోటీ పడుతున్నారు. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు తుది అర్హత పరీక్షలు జరగనున్నాయి.ఇక మార్చి 12 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.