ఏ నిమిషంలోనైనా సుచరిత పార్టీ మారే అవకాశం!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్‌ కుటుంబాన్ని వీడేది లేదని చెప్పిన మాజీ మంత్రిప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత.. మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఏ నిమిషంలోనైనా తాను పార్టీ మారే అవకాశం ఉందని వైసీపీ కార్యకర్తలకే చెప్పేశారు. రెండ్రోజుల కిందట తన నియోజకవర్గం పరిధిలోని కాకుమానులో జరిగిన పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశంలో ఆమె మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లు గురువారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. నా భర్త దయాసాగర్‌ పార్టీ మారతాను.. నువ్వూ నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకులినైనా భర్తతో వెళ్లాల్సిందేగా’ అని ఆమె అన్నారు. తన భర్త ఒక పార్టీలోతాను మరొక పార్టీలోతమ పిల్లలు వేరొక పార్టీలో ఉండరని.. ఉంటే అందరం ఒక పార్టీలోనే ఉంటామని చెప్పారు. కాగా ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌గా పనిచేసిన సుచరిత భర్త దయాసాగర్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అది కూడా టీడీపీ తరఫునే బరిలోకి దిగాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగరీత్యా జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటి వరకు నా భర్త నా నిర్ణయాలకు కట్టుబడి నా వెంట పయనించారు.. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉండి ఆయన వెంట పయనిస్తా. కుటుంబమంతా ఒకే పార్టీలో ఉంటుంది కానీ వేర్వేరు పార్టీల్లో ఉండబోదు’ అని సుచరిత స్పష్టం చేశారు. భర్త పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఆమె ఖండించకపోగా.. ఆయన వెంటే నడుస్తానని ఆమె అనడంతో వైసీపీ పెద్దలు బిత్తరపోయారు.

చాలా రోజులుగా మనస్తాపం

వైఎస్‌ కుటుంబానికి ఎంతో విశ్వసనీయురాలైన సీనియర్‌ ఎమ్మెల్యే సుచరిత పార్టీ మారేందుకు సిద్ధమవడం వైసీపీలో పెద్ద కలకలమే రేపింది. అయితే ఆమె ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అకారణంగా హోం మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. అంతేగాక ఇచ్చినట్లే ఇచ్చి మూణ్ణాళ్లకే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా లాగేసుకోవడం ఆమెకు మనోవేదన కలిగించినట్లు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు హోం మంత్రి పదవి.. పేరు కోసమే ఇచ్చారే తప్ప ఎటువంటి అధికారం ఇవ్వలేదని అప్పట్లోనే ఆమె వాపోయిన సందర్భాలున్నాయి. సొంత శాఖలో కానిస్టేబుల్‌ను సైతం బదిలీ చేయించుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో తన సామాజికవర్గానికి చెందిన అందరినీ కొనసాగించి.. తనకు మాత్రమూ ఉద్వాసన పలకడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. శాఖాపరంగా కూడా తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆవేదనతో ఉన్నారు. ఇక వైసీపీలో భవిష్యత్‌ లేదని నిర్ణయానికి వచ్చారు. అందుకే టీడీపీ వైపు చూస్తున్న భర్తతోపాటే అడుగులు వేయాలని నిశ్చయించుకున్నారని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.