కంటోన్మెంట్‌ లోని  ఆ భూములు ఎవరికి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనానికి కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటు నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. విలీనానికి కేంద్రం షరతులు ఏమైనా విధిస్తుందా అనే చర్చ మొదలైంది. పదివేల ఎకరాల స్థలంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విస్తరించి ఉండగా.. దీనిలో 580 ఎకరాలు ఆర్మీ అధీనంలో ఉన్నాయి. మరో నాలుగు ఆర్మీ రిజర్వ్‌డ్‌ స్థలాలు ఉన్నాయి. 420 ఎకరాల స్థలాల్లో విమానాశ్రయం తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, 2,748 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, 400కుపైగా కాలనీలు, 50కిపైగా బస్తీలు, మురికివాడలు, 490 ఎకరాల్లో ఓల్డ్‌ గ్రాంట్‌ బంగ్లాలు ఉన్నాయి. 91 ఎకరాలు డిఫెన్స్‌ ఖాళీ స్థలాలు ఉన్నాయి.

కంటోన్మెంట్‌ స్థలాలు 303 ఎకరాలు. 238 ఎకరాల్లో 16 నోటిఫైడ్‌ సివిల్‌ ఏరియాలున్నాయి. ఒకవేళ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయిస్తే ఈ భూముల్లో వేటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు, ఏ షరతుల మీద అనే విషయమై తీవ్ర చర్చ జరుగుతోంది. 5,810 ఎకరాల స్థలాలు ఆర్మీ అధీనంలోనే ఉంటాయని చెబుతున్నారు. బీ-1 కేటగిరీ స్థలాలు డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ పర్యవేక్షణలో ఉంటాయని, బీ-2 కేటగిరీ (రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు, కాలనీలు, బస్తీలు, మురికివాడలు ఉన్న ఏరియాలు), బీ-4 కేటగిరీ (కంటోన్మెంట్‌) స్థలాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారని భావిస్తున్నారు. బీ-3 కేటగిరీ కింద ఉన్న ఓల్డ్‌ గ్రాంట్‌ బంగ్లాలపై హక్కులు రక్షణ శాఖకే ఉండడం, వాటి పర్యవేక్షణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించవచ్చని అనుకుంటున్నారు. లేదా కంటోన్మెంట్‌ చట్టంలో మార్పులు చేసి, వాటిని ప్రస్తుతం ఉన్న వారికి మార్కెట్‌ ధర ప్రకారం, ఇతర పద్ధతుల్లో బదిలీ చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అటు మోదం-ఇటు ఖేదం

జీహెచ్‌ఎంసీలో విలీనంపై కంటోన్మెంట్‌లో అటు మోదం, ఇటు ఖేదం వ్యక్తమవుతోంది. విలీనం జరిగితే అదనపు అంతస్థులు నిర్మించుకోవచ్చని ప్రజలు ఆశ పడుతున్నారు. కంటోన్మెంట్‌లోని వందల ఎకరాల ఖాళీ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, ఆ స్థలాల్లో బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టవచ్చని, అభివృద్ధిపరంగా పలు చర్యలు చేపడతారని, ఫలితంగా కంటోన్మెంట్‌ రూపురేఖలు మారతాయని ఆనందపడుతున్నారు. అయితే, ప్రస్తుతం ట్రాఫిక్‌ సమస్య లేకుండా, విశాలమైన రహదారులతో, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్న తాము విలీనం వలన వాటికి దూరం అవుతామన్న ఆందోళను మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా పెను మార్పులు

జీహెచ్‌ఎంసీలో విలీనం అయితే కంటోన్మెంట్‌లో రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. కంటోన్మెంట్‌ చట్టం ప్రకారం ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గుర్తింపు పొందిన పార్టీల చిహ్నాలు లేకుండా కంటోన్మెంట్‌ పాలక మండలి ఎన్నికలు నిర్వహిస్తోంది. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతుండడంతో బోర్డు సభ్యులపై పార్టీల విప్‌ ఉండడం లేదు. ఫలితంగా ఎన్నికల్లో గెలిచే నేతలు ఇష్టానుసారంగా పార్టీలు మారుతున్నారు. విలీనం జరిగితే నేతలకు ఈ అవకాశం పోయినట్టే. ఇప్పటి వరకూ కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి సభ్యులకు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు పోయినట్టే.

Leave A Reply

Your email address will not be published.