చెత్త నిర్ణయాలతోనే ఓడిపోయాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు వెనుకబడింది. ఉత్కంఠ భరితంగా జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అర్షదీప్ సింగ్ అయితే వేసిన రెండు ఓవర్లలోనే 37 పరుగులు ఇచ్చాడు. దానికితోడు వరుసగా మూడు నోబాల్స్ వేశాడు. ఈ మూడూ కూడా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలు కూడా అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ వసీం జాఫర్ కూడా చెప్పాడు. టీమిండియా ఓటమికి హార్దిక్ నిర్ణయాలు కూడా కారణమేనని, పాండ్యా సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నాడు. తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన శివమ్ మావి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ రెండో మ్యాచ్‌లో కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం కూడా పాండ్యా ఇవ్వలేదన్నాడు. అలాగే మావి ఎప్పుడూ కూడా మంచి డెత్ బౌలర్ కాదని, అలాంటి వాడికి చివరి ఓవర్ ఇవ్వడమేంటో తనకు అర్థం కాలేదని చెప్పాడు.

పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్యాకు అనుభవం కూడా ఉందని జాఫర్ అన్నాడు. అలాంటి బౌలర్ కేవలం రెండు ఓవర్లే వేయడం ఏంటని నిలదీశాడు. డెత్ ఓవర్లలో పాండ్యా బౌలింగ్ చేస్తాడని తాను అనుకున్నానని, కానీ అతను వేయకుండా మావికి బంతి ఇవ్వడానికి వెనుక కారణం తనకేం అర్థం కాలేదన్నాడు. అంతకన్నా డెత్ ఓవర్ స్పెషలిస్టు అయిన అర్షదీప్ సింగ్ చేత బౌలింగ్ చేయించాల్సిందని సూచించాడు. అర్షదీప్ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసినా కూడా.. అతను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అనే విషయాన్ని మర్చిపోకూడదన్నాడు.

పాండ్యా లేదంటే అర్షదీప్ ఈ ఓవర్లు వేయాల్సిందని, అంతేకానీ మావి వంటి యువ ఆటగాడి చేత డెత్ ఓవర్లు వేయించడం ఏం బాగలేదని తేల్చిచెప్పాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా, అర్షదీప్ చెరో రెండు ఓవర్లే బౌలింగ్ చేశారు. మావి నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నా అతను కూడా 47 పరుగులు ఇవ్వడంతో శ్రీలంక భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో జట్టుకు శుభారంభం దక్కకపోవడంతో భారత జట్టు ఓటమి పాలైంది.

Leave A Reply

Your email address will not be published.