హైదరాబాద్ లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌ సిటీకి భారత వాతావరణశాఖ(IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత భారీగా పడిపోయే అవకాశముందని హెచ్చరించింది. రాబోయే కొద్దిరోజుల పాటు చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశముందని, చలిగాలులు బలంగా వీస్తాయని స్పష్టం చేసింది. రానున్న నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో ఏకంగా 11 డిగ్రీల సెల్సియస్‌కు ఉస్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

శుక్రవారం హైదరాబాద్‌లో కనిష్ణ ఉష్ణోగ్రత 20.5 డిగ్రీల సెల్సియస్ నమోదు అవ్వగా.. గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని ఈ లెక్కలను బట్టి చూస్తే తెలుస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తుందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్‌ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

హైదరాబాద్‌లోని ఛార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో జనవరి 10 వరకు ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశముందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. గత కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌లో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టగా.. శుక్రవారం నగరంలో పడిన వర్షంతో చలి తీవ్రత మరింత పెరిగింది. శుక్రవారం నుంచి నగరంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చలికి తోడు పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16.8, గరిష్ట ఉష్ణోగ్రత 29.2, మహబూబ్ నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 20.6, గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు నమోదైంది. రామగుండంలో కనిష్ట ఉష్ణోగ్రత 18.4, గరిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలు, నిజామాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 18.5, గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీలు నమోదైంది. నల్లగొండలో కనిష్ట ఉష్ణోగ్రత 19.0, గరిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీలు, ఖమ్మంలో కనిష్ట ఉష్ణోగ్రత 21.6 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలో కనిష్ట ఉష్ణోగ్రత 22.0 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు నమోదైంది. హకీంపేట్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 18.4, గరిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీలు, దుండిగల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు నమోదైంది.

 

Leave A Reply

Your email address will not be published.