తమ్ముడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే అన్న మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జగిత్యాల జిల్లాలో ఓ విషాద సంఘటన స్థానికుల్ని తీవ్రంగా కలచివేసింది. మెట్‌పల్లి పట్టణంలోని రెడ్డి కాలానికి చెందిన బొగ నాగ భూషణం టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో రెండో కుమారుడు బొగ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. మరుసటి రోజు అనగా ఆదివారం ఉదయం శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మొదటి కుమారుడు బొగ సచిన్ స్మశాన వాటికలోనే కుప్పకూలిపోయాడు.వెంటనే అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.మొదటి కుమారుడు సచిన్ కోరుట్ల పట్టణంలోని ఓ బ్యాంక్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

తన సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన అన్న సచిన్..తన కళ్ల ముందే తమ్ముడు శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒత్తిడిలోనై మనోవేదనతోనే శ్మశానవాటికలోనే కుప్పకూలిపోయాడని బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

కేవలం ఒక్క రోజు వ్యవధిలో చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకు ఇద్దరు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారన్న వార్తను తండ్రి నాగభూషణం జీర్ణించుకోలేకపోయాడు. అంతే కాదు చిన్న కొడుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు సైతం ఒకే సారి ఇద్దరు చనిపోవడం చూసి బోరున విలపించారు. రెండు చావులతో ఒక కుటుంబం విషాదఛాయలు అలుముకోవడం చూసి స్థానికులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. పగ వారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని స్థానికులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.