కేసీఆర్ నిర్ణయాలతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చేస్తున్న ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతున్నాయా? అధినేత తీరుపై కక్కలేక మింగలేక చెప్పింది చేస్తూ తీవ్ర అసహనంతో ఉన్నారా? వచ్చే ఎన్నికల కోసం సొంత నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో పని చేయలేక సతమతమవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు.

కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ కోసం ఏర్పాట్లు

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ముందు సరిహద్దు రాష్ట్రాలు పై ఫోకస్ చేస్తున్న కేసీఆర్, సరిహద్దు రాష్ట్రాలలో పార్టీ అనుకూలతలపైన అధ్యయనం చేస్తున్నారు. త్వరలో సభలు, సమావేశాలతో హోరెత్తించాలని వ్యూహాలు రచిస్తున్నారు. సంక్రాంతి తర్వాత వివిధ రాష్ట్రాలలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్న కేసీఆర్ ఆ బాధ్యతలను పార్టీ నాయకులకు అప్పగించారు.

సరిహద్దు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం సరిహద్దు జిల్లాల నేతలకు కీలక బాధ్యతలు
సరిహద్దు రాష్ట్రాలలో పరిస్థితులను అధ్యయనం చేసి అక్కడి నేతలు ఆకట్టుకునేలా పనిచేయాలని సరిహద్దు జిల్లాల నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఈ బాధ్యతలే ఆయా నేతలకు తలనొప్పిగా తయారయ్యాయి. మెదక్, మహబూబ్నగర్ జిల్లా నేతలకు కర్ణాటక, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నేతలకు మహారాష్ట్ర, ఖమ్మం నేతలకు ఏపీ బాధ్యతలు సీఎం కేసీఆర్ అప్పగించినట్టు తెలుస్తుంది. అక్కడ పార్టీని విస్తరించడానికి పని చేయడం వారికి పెద్ద టాస్క్ అయితే, ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సొంత నియోజకవర్గాల్లో పని చేయకుండా, పక్క రాష్ట్రాల్లో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ తరఫున కోసం పని చేయాల్సి రావడం నేతలకు ఇబ్బందికరంగా మారింది.

సొంత నియోజకవర్గంపై నేతల్లో ఆందోళన

సొంత నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించ లేకపోతే, వచ్చే ఎన్నికల్లో తేడా కొడుతుంది అన్న భావన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను వ్యక్తమవుతుంది. ఇక రెండు పడవల మీద కాలు వేస్తే ఇబ్బంది పడతారేమో అన్న ఆందోళనలో నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పక్క రాష్ట్రాల బాధ్యతలను నెత్తిమీదకు ఎత్తుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, భవిష్యత్ రోజుల్లో పక్క రాష్ట్రాలలో పర్యటనల స్పీడ్ పెరిగితే, అక్కడ పార్టీకి క్యాడర్ దొరికితే మరిన్ని పనులూ నెత్తిమీద పెట్టుకోవాల్సి వస్తుందేమో అని ఆందోళన పడుతున్నారు.

ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణం.. వారికి కొత్త టెన్షన్

ఒకపక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తమ కార్యక్రమాల వేగాన్ని పెంచి, దూకుడుగా అధికారపక్షాన్ని, అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది వారికి మరొక తలనొప్పిగా తయారైంది. దీంతో సొంత నియోజకవర్గాల్లో తమ పట్టు నిలుపుకోవడం కోసం, ఇదే అదే సమయంలో సరిహద్దు రాష్ట్రాలలో అధినేత అప్పగించిన పనులు చేయడం కోసం తెగ సతమతమవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది అన్నట్టు తయారైంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి. కక్కలేక మింగలేక.. అధినేత చెప్పిన పని చేస్తున్న వారి బాధ వర్ణనాతీతంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.