నదీ వివాదాలు పరిష్కరించేదెన్నడు..?

-  ప్రాజెక్టులు కట్టేదెన్నడు..? నీళ్లచ్చేదెప్పుడు? -  కేంద్రం పై విరుచుక పడ్డ : కేసీఆర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రాల మధ్య నదీ వివాదాల సమస్యల పరిష్కారంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్‌ తూర్పారాబట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఎనిమిది సంవత్సరాల కిందట ఇప్పుడున్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మన జీడీపీ 11లక్షల కోట్లకు పెంచుకున్నం. తెలంగాణ పని చేసినట్లు కేంద్రం పనిచేస్తే జీడీపీ 14లక్షల కోట్లు ఉండేది. కానీ, కేంద్రం అసమర్థ విధానాలు, దుర్మార్గపూరితమైన విధానాల వల్ల తెలంగాణ కేంద్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయింది. ఒక రాష్ట్రం 3లక్షల కోట్లు నష్టపోతే దేశమంతా ఎంత నష్టపోయి ఉంటుంది’ అని ప్రశ్నించారు.

విద్వేషాలు రగిలిస్తే.. పరిస్థితి ఏంటీ?

‘ప్రగతిశీల విధానంతో అందరు ప్రజలంతా మావాళ్లే అనుకొని.. అందరినీ కడుపులో పెట్టకొని కాపాడేది గొప్ప పార్టీ, గొప్ప ప్రభుత్వం అవుతుందని కానీ.. ప్రజలను విడదీసి, మతచిచ్చుపెట్టి, కులాల కుంపట్లు పెట్టి, ద్వేషం రగిలిస్తే.. తద్వారా మొలకెత్తే విషవృక్షాలు ఎవరిని దహించి వేస్తాయి. దేశం అశాంతికి లోనైతే.. మనం తాలిబన్లలాగా తయారైతే.. పెట్టుబడులు వస్తాయా? ఉద్యోగాలు ఉంటయా? ఉన్న పరిశ్రమలు నిలబడి ఉంటాయా? కర్ఫ్యూలు, లాఠీచార్జీ, ఫైరింగ్‌లాంటి వాతావరణం వస్తే ఎంత భ్రష్టుపట్టి పోతుంది సమాజం. దేశాన్ని ఎలాంటి వక్రమార్గంలో పెట్టే దుష్ట పన్నాగాలు, దుర్మార్గ ప్రయత్నాలు జరుగుతున్నాయో గ్రామాల్లో చర్చ పెట్టాలి. కేసీఆర్‌ చెప్పే మాటలు ఎంత వరకు నిజం అనే మాటను గమనిస్తే దేశానికే ఎంతో మేలు జరుగుతుంది. దేశం మొత్తం బాగుంటేనే మనం బాగుంటాం. దేశపురోభివృద్ధిలోనే మన పురోభివృద్ధి ఉంటుంది.

పనికిమాలిన పాలసీలతో నీటి యుద్ధాలు..

‘దేశంలో నీటి యుద్ధాలు జరుగుతుంటాయి. కావేరి నదిపై తమిళనాడు, కర్ణాటక కొట్లాడుకుంటున్నాయి. బియాస్‌ నది గురించి పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ కొట్లాడుకుంటున్నయ్‌. ఎందుకీ కొట్లాట? దేశంలో నీటి లభ్యతలేకనా? వాస్తవం చెప్పాలంటే.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యధికంగా వ్యవసాయ అనుకూలమైన భూమి కలిగి ఉన్నది ఒకేఒక దేశం భారతదేశం. అమెరికాలో వ్యవసాయ అనుకూల భూమి 29శాతమే. చైనాలో వ్యవసాయ అనుకూల భూమి16శాతమే. భారతదేశ భూభాగాన్ని ఎకరాల్లో కొలిస్తే.. 83కోట్ల ఎకరాలు. ఇందులో సరాసరి 41కోట్ల ఎకరాలు అద్భుతమైన పంట పండే భూములున్నాయి. మూడు రకాల ఆగ్రో వాతావరణ పరిస్థితులు.

సూర్యకాంతి అద్భుతమైన దేశం మనది. దేశంలో 1.40లక్షల టీఎంసీల వర్షం కురుస్తుంది. ఇందులో 70వేల టీఎంసీలు ఆవిరైపోతే.. 70వేల టీఎంసీలు కృష్ణా, గోదావరి, గంగా, నర్మదలా లాంటి నదుల్లో ప్రవహిస్తుంది. ఇందులో దేశం వాడుతున్నది కేవలం 20వేల టీఎంసీలే. మిగిలిన 50వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నయ్‌. మరెందుకు నీటి యుద్ధాలు జరుగుతున్నయ్‌? దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల, పలికిమాలిన చెత్తతో కూడిన వాటర్‌ పాలసీలతో రాష్ట్రాలకు రాష్ట్రాలకు జుట్లు ముడేసి తగువులు పెట్టి.. ఢిల్లీ పెద్దలు అనాటి నుంచి ఇదే పద్ధతిలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు’ అని కేసీఆర్‌ మండిపడ్డారు.

కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్‌ వేసినా అతీగతి లేదు..

‘రాష్ట్రంలో కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించించేందుకు ట్రిబ్యునల్‌ వేసినా ఇప్పటి వరకు అతీగతి లేదు. 20 ఏళ్లుగా వాదనలే జరుగకపోతే.. తీర్పులు ఎప్పుడు రావాలి? కేటాయింపులు ఎప్పుడు జరిగాలి? డిజైన్లు ఎన్నడు కావాలి? అనుమతులు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టుల నిర్మాణం ఎన్నుడు పూర్తి కావాలి? నీళ్లు ఎన్నడు రావాలి? ఇదేనా భారతదేశం? 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలైతే దేశంలో మంచినీళ్లకు గతి ఉండదా? 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మంచినీళ్లు ఇచ్చే శక్తి లేకుండాపోయిందా? దేశానికి. దీనికి కారణం దుర్మార్గపూరితమైనటువంటి చేతగాని దద్దమ్మల నీటి పాలసీలు కారణం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.