మోడీ తో భేటీకి డుమ్మాకొట్టిన సోమేశ్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ను ఆగమేఘాల మీద ఏపీకి ఎందుకు పంపారు? హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆయన్ను ఎందుకు రిలీవ్‌ చేసింది? అంత హడావుడిగా ఎందుకు చర్యలు తీసుకున్నారు? అంటే.. ఈ నెల మొదటి వారంలో ప్రధాని మోదీ సమావేశానికి సోమేశ్‌కుమార్‌ డుమ్మా కొట్టడమే కారణమై ఉండొచ్చని ఢిల్లీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 5-7 తేదీల్లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నిర్వహించిన సమావేశానికి తెలంగాణ సీఎ్‌సగా ఉన్న సోమేశ్‌ హాజరవలేదు. అందుకే ఆయనపై కేంద్రం వేగంగా చర్యలు తీసుకుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) గతంలో జారీచేసిన ఆదేశాలను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. ఆయన ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కే వెళ్లాలని మంగళవారం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే కోర్టు తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే డీవోపీటీ ఆయన్ను రిలీవ్‌ చేసేసింది. తక్షణమే ఆంధ్రప్రదేశ్‌ జీఏడీలో రిపోర్టు చేయాలనీ ఆదేశించింది. ఇంత హడావుడిగా చర్యలు తీసుకోవడానికి కారణం ‘సీఎస్‌ల రెండో జాతీయ సమావేశాని’కి సోమేశ్‌ హాజరు కాకపోవడమేనని ఢిల్లీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ సమావేశంలో క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.