గొల్లపూడిలో ఉద్రిక్తత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉమ్మడి కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన లీజుపై వివాదం జరుగుతోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబ సభ్యుల మధ్య గొడవ తలెత్తడంతో హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. స్థల వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు డిసెంబరు 28న తహశీల్దార్ నోటీసులిచ్చారు. అయితే ఈ కార్యాలయాన్ని అధికారులు, పోలీసులు తొలగించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈరోజు తెల్లవారుజామునుంచే అధికారులు, పోలీసులు స్థానిక టీడీపీ కార్యాలయాన్ని తొలగించారు. పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తరలించారు. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఆనుకొని కూర్చునే పసుపురంగు బల్లలు సైతం తొలగించారు. టీడీపీ కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపట్టారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ అనుమతించడంలేదు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అక్కడకు చేరుకొని నిరసన తెలియజేశారు. కార్యాలయం తొలగింపు నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మొహరించి ఆయన్ను బయటకు రానివ్వకుండా చూశారు.

Leave A Reply

Your email address will not be published.