ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు

-  వాహనంలోకి లాగేందుకు చేయిపట్టి ఈడ్చిన డ్రైవర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతను స్వయంగా తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్‌ స్వాతి మలివాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్‌ ఆమెను కారులోకి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్వాతి మలివాల్‌ చేతిని పట్టుకుని కొంత దూరం వాహనంతో ఈడ్చుకెళ్లాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దేశ రాజధానిలో మహిళలకు రక్షణను స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్‌ స్వాతి మలివాల్‌ ప్రయత్నించారు. గురువారం ఉదయం 3.11 గంటలకు తన బృందంతో కలిసి బయటకు వెళ్లారు.కాగా, ఎయిమ్స్‌ హాస్పిటల్‌ సమీపంలో తన బృందాన్ని దూరంగా ఉంచిన స్వాతి మలివాల్‌ ఒంటరిగా రోడ్డుపై ఉన్నారు. ఇంతలో బాలెనో కారులో అటుగా వచ్చిన 47 ఏళ్ల హరీశ్‌ చంద్ర, మద్యం మత్తులో ఆమెను వేధించాడు. తన వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతం చేశాడు. ఆమె నిరాకరించగా కారుతో కాస్త ముందుకు వెళ్లాడు. యూ టర్న్‌ తీసుకున్న అతడు మళ్లీ స్వాతి మలివాల్‌ వద్దకు వచ్చాడు. కారులోకి ఎక్కాలని మరోసారి ఆమెను బలవంతం చేశాడు.మరోవైపు కారు విండో నుంచి చేయి లోనికి జాపి ఆ డ్రైవర్‌ను పట్టుకునేందుకు స్వాతి మలివాల్‌ ప్రయత్నించారు. అయితే అతడు ఆమె చేయి పట్టుకుని విండో అద్దం మూసేశాడు. దీంతో ఆమె చేయి ఇరుక్కుంది. అతడు కారును డ్రైవ్‌ చేస్తూ 15 మీటర్ల దూరం వరకు ఆమెను ఈడ్చుకెళ్లాడు.కాగా, దూరంగా ఉన్న ఢిల్లీ మహిళా కమిషన్‌ బృందం దీనిని గమనించి వెంటనే స్పందించింది. ఆ కారును అడ్డుకుని నిలువరించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌ చేయడంతోపాటు డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌ను వేధించిన హరీశ్‌ చంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.