తెలంగాణలో ఎకో టూరిజానికి ప్రోత్సాహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో బాధ్యతా యుతమైన, పర్యావరణ హిత టూరిజాన్ని ప్రోత్సహిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పూర్తయిన వివిధ ఎకో టూరిజం ప్రాజెక్టులను మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.గాణ రాష్ట్రంలో అద్భుత, ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు ఒక్కొటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. వాటి ప్రత్యేకతను కాపాడుతూనే, ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తామన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మన్ననూరు వద్ద ఎకో టూరిజం రిసార్ట్, ఆరు కాటేజీలు, ఎనిమిది కొత్త సఫారీ వాహనాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పర్యాటకుల సమక్షంలో మంత్రి ప్రారంభించారు.పర్యాటకులు ఒక రోజు పాటు అమ్రాబాద్‌లో గడిపేందుకు వీలుగా రూపొందించిన టైగర్ స్టే ప్యాకేజీ ఇకపై ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా పోర్టల్‌ను ప్రారంభించారు. అమ్రాబాద్ వచ్చే సందర్శకులకు సేవలు అందించేందుకు కొత్తగా శిక్షణను ఇచ్చిన గైడ్లు ఇకపై అందుబాటులో ఉంటారని అటవీ శాఖ ప్రకటించింది. అటవీ పర్యవేక్షణ నేరుగా చేసేందుకు వీలుగా కొత్తగా 10 లైవ్ నిఘా కెమెరాలు నేటి నుంచి పనిచేయటం మొదలైంది. స్థానిక గిరిజన, చెంచు మహిళలకు ఉపాధి కల్పించే జ్యూట్ బ్యాగుల తయారీ, హెల్త్ క్లినిక్, ప్లాస్టిక్ రీ సైక్లింగ్ సెంటర్, బయోల్యాబ్‌లను సందర్శించిన మంత్రి, అక్కడ పనిచేసే వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అమ్రాబాద్‌తో పాటు అటవీ ప్రాంతాల్లో పర్యటించే, ప్రయాణించే ప్రతీ ఒక్కరూ బాద్యతాయుతంగా ఉండాలని మంత్రి కోరారు. అన్ని అడవులు ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, వన్యప్రాణులకు హాని చేసే ప్లాస్టిక్‌ అడవుల నుంచి దూరంగా ఉంచాలని తెలిపారు. జాతీయ సంపదలు అయిన అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్‌ ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, ఎఫ్డీసీ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, అమ్రాబాద్ ఫీల్డ్ డైరక్టర్ క్షితిజ, నాగర్ కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్, ఎఫ్డీఓలు నవీన్ రెడ్డి, బీ విశాల్, వై శ్రీనివాస్, సర్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.