బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం ఇవ్వలేదనటం సిగ్గు చేటు

- సర్కారు కోర్టుకెక్కడం యావత్ ప్రభుత్వ యంత్రాంగానికే తలవంపు - బీజేపీ నాయకురాలు విజయశాంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజ్యాంగంపై, చట్టపరమైన విధులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపాటి గౌరవం ఉందో… బడ్జెట్ సమావేశాల విషయంలో ఆయన అనుసరించిన వ్యవహారశైలితో బాగా అర్థమైందంటూ బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం ఇవ్వలేదంటూ సర్కారు కోర్టుకెక్కడం యావత్ ప్రభుత్వ యంత్రాంగానికే తలవంపుల్లాంటిదన్నారు. బడ్జెట్ సమావేశాలకు ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్ సిద్ధంగా ఉన్నారు కాబట్టే, తమ ప్రసంగానికి సంబంధించిన వివరాల కోసం అడిగారని విజయశాంతి(Vijaya shanthi) వెనకేసుకొచ్చారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం స్పందించకుండా ఎప్పటిలాగే గవర్నర్ గారిని మరోసారి అవమానించాలని భావించి, కోర్టుకెళ్లి భంగపడిందన్నారు. చివరికి బడ్జెట్ సమావేశాల తేదీ కూడా మార్చుకునే ఆలోచన చెయ్యాల్సి వచ్చిందని విజయశాంతి చెప్పారు. మరీ ముఖ్యంగా గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని లాయర్‌ దుష్యంత్‌ దవే చెప్పాల్సి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు. పదే పదే గవర్నర్‌ను ఎలా అవమానించాలా… అనే ధ్యాస తప్ప ఈ సర్కారుకి మరో పనిలేదని స్పష్టమైందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై సీ-ఓటర్‌ ఇండియా టుడే నిర్వహించిన సర్వే వెల్లడించిన బెస్ట్ సీఎం జాబితాలో కేసీఆర్ సోదిలో కూడా లేకుండా పోయారని రాములమ్మ ఎద్దేవా చేశారు.

కొంత కాలంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడంతో గవర్నర్‌ చర్యలపై ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాకపోవడమే సర్కారు నిర్ణయానికి కారణమైంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉన్నందున.. అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే గవర్నర్‌ తమిళిసై మాత్రం ఇప్పటికీ అనుమతి తెలపలేదు. పైగా గవర్నర్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్‌ కమ్యూనికేషన్‌ వెళ్లింది. బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్‌ కార్యాలయం సర్కారును కోరింది.

దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో గవర్నర్‌ కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిబ్రవరి 3 సమీపిస్తుండటంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవేను అందుకోసం రంగంలోకి దించింది.

Leave A Reply

Your email address will not be published.