ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి తోకలసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. బిఆర్ కెఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ కమీషనర్ హనుమంతరావు లు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు పధకం అమలులో సౌలభ్యం, పారదర్శకత కొరకై ఈ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ పధకం అమలు లో భాగస్వామ్యులైన రైతులు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యానవన శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీలు, నర్సరీ ఇంచార్జీలు ఈ మొబైల్ యాప్ లో ఉంటారని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టదలచిన భూమి విస్తీర్ణం, పంపిణి చేసిన మొక్కలు,అంతర పంటలు, పంటల కొరకై అందించిన రాయితీ తదితర వివరాలు ఈ మొబైల్ యాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరుగుతున్నదని మంత్రి వివరించారు.రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేపట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలుకై ప్రభుత్వం మొదటి విడతగా రూ. 107 .43 కోట్లు విడుదల చేయగా, దీనిలో రూ. 82 కోట్లను రైతులు, కంపెనీలకు రాయితీగా అందించడం జరిగిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ మొక్కల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, అంతర పంటల సాగు, సూక్ష్మ సేద్యం కొరకై ఎకరానికి రూ. 50,918 లను రాయితీగా అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుత 2022-23 సంవత్సరంలో 15710 మంది రైతులు 61277 ఎకరాలలో చేపట్టారని తెలిపారు. 2023-24 సంవత్సరంలో రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు లక్ష్యంగా నిర్ణయించామని వెల్లడించారు.         దేశంలో 100 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పామ్ ఆయిల్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం 2 .90 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే ఉందని వివరించారు. దేశంలో పామ్ ఆయిల్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 70 లక్షల ఎకరాల విస్తీర్ణం అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం        52 ,666 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని తెలిపారు. నూనె గింజల పంటల్లో పామాయిల్ ఎక్కువ దిగుబడినిస్తుందని, దాదాపు 30 సంవత్సరాలవరకు ఎకరానికి లక్షన్నర వరకు ఆదాయం పొందవచ్చని వెల్లడించారు. రాష్టంలో పామ్ ఆయిల్ మొక్కలు పెంచడం కోసం ఇప్పటి వరకు 38 కంపెనీలు నర్సరీలు ఏర్పాటు చేశాయని తెలియచేశారు.

Leave A Reply

Your email address will not be published.