తుర్కియోలో 100 సార్లు కంపించిన భూమి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తుర్కియో.. సిరియా ప్రాంతాల్లో సోమవారం నాడు మూడు తీవ్రమైన భూకంపాలు సంభవించాయి. తెల్లవారుజామున 7.8 తీవ్రతతో ఒకసారి రాగా మధ్యాహ్నం 1:24 గంటలకు 7.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతన్న సమయంలో సాయంత్రం 6 గంటలకు 6 తీవ్రతతో మూడోసారి భూకంపం వచ్చింది.కేవలం గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించడంతో తుర్కియో.. సిరియాలలో భారీగా ప్రాణ.. ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే సుమారు 2300 లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది క్షతగాత్రులు గా మారారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.గడిచిన 84 ఏళ్లలో తుర్కియోలో నమోదైన అతిపెద్ద భూకంపం ఇదేనంటూ వెల్లడించారు. అయితే నిన్నటి నుంచి తుర్కియేలో వందసార్లు భూ ప్రకంపకలు సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. భారీ భూకంపం వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.నిన్న రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత నుంచి ప్రకంపనలు ఆగడం లేదు. ఇప్పటి వరకు రిక్టర్ స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో 100 సార్లు భూమి కంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులోనూ 5.0.. 6.0 తీవ్రతతో కొంతకాలం భూ ప్రకంపనలు కొనసాగుతాయని ఈ విషయంలో సహాయ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.కాగా తుర్కియోలో భారీ భూకంపం కారణంగా మధ్యదరా సముద్రంలోని ఇసికందరన్ లోని లిమాక్ పోర్టు తీవ్రంగా దెబ్బతింది. కంటైనర్లు ఉంచిన ప్రాంతాల్లో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తుర్కియేలోని విద్యుత్ వ్యవస్థ.. సహజ వాయువు పైప్ లైన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వ రంగ పైపులైన్ ఆపరేటర్ బోటాస్ వెల్లడించింది.
గాజాయాంటెప్ హాటే.. కహ్రామన్మరాస్ ప్రావిన్స్ లకు పైప్ లైన్లో గ్యాస్ సరఫరా ఆగిపోయినట్లు పేర్కొంది. పైపు లైన్ కేంద్రం భూకంప కేంద్రానికి సమీపంలో ఉండటంతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో ఆస్పత్రులు.. ఆహార శాలలకు గ్యాస్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించేందుకు అత్యవసర చర్యలు చేపడుతోంది.

Leave A Reply

Your email address will not be published.