ఉపాధి హామీ పథకం అమలులో దేశంలో మనమే నెంబర్ వన్

- 10.66 కోట్ల పనిదినాలు పూర్తిచేశాం - 11 కోట్ల పనిదినాల కల్పనకు అనేక షరతులతో కేంద్రం ఆమోదించింది - ఈ ఏడాది 12 కోట్ల పనిదినాలు అవసరం - 61 శాతం మహిళలు ఉపాధి పనులు ఉపయోగించుకుంటున్నారు - చేసిన పనుల్లో ఎస్సీలు 21.66శాతం, ఎస్టీలు 20.3 శాతం ఉన్నారు - రాష్ట్రంలో 1.06 కోట్ల కూలీలకు జాబ్ కార్డులు - ఉపాధి హామీలో ఈ ఆర్ధిక సంవత్సరంలో 3135.7 కోట్ల రూపాయలు ఖర్చు - రాగా సాఫ్ట్ వేర్ మార్చి అలవికానీ నిబంధనలతో నరేగ సాఫ్ట్ వేర్ తెచ్చారు - పనిముందు, పనిజరిగేటప్పుడు, పని తర్వాత ఫోటోలు తీయాలన్ననిబంధన పెట్టారు - ఉపాధి హామీని అత్యధికంగా ఉపయోగించుకుంటున్నామన్న అక్కసు కేంద్రానికి ఉంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకుంటుందన్న అక్కసు కేంద్రానికి ఉందని, అనేక నిబంధనలు పెట్టి నిధులు ఆపే కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డిలు ఆరోపించారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 8వ కౌన్సిల్ సమావేశం నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అధ్యక్షతన తెలంగాణ శాసనసభలోని సమావేశ మందిరంలో జరిగింది.

గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు గడ్డపారలు, పారలు, గంపలు ఇచ్చేవారని, రానురాను ఆపేశారని, అవి ఇవ్వాలని మళ్లీ కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అదేవిధంగా మెడికల్ కిట్స్ ఇవ్వాలని కోరినా…కేంద్రం స్పందించడం లేదన్నారు.

ఉపాధి హామీ పథకంలో 10.66 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, మళ్లీ పనిదినాలు కావాలని అడిగితే అనేక షరతులు పెట్టి 11 కోట్ల పనిదినాలు కల్పించిందన్నారు. కేంద్రం ఎన్ని షరతులు పెట్టినా వాటన్నింటిని పాటిస్తూ కూలీలకు పనిదినాలు కల్పిస్తున్నామన్నారు.

12 కోట్ల పనిదినాలు కల్పించే లక్ష్యంతో కేంద్రాన్ని మరిన్ని పనిదినాలు కావాలని కోరినట్లు వెల్లడించారు.

గ్రామాల్లో గొర్లు కాసేవారికి షెడ్లు వేసుకునేందుకు ప్రభుత్వమే స్థలాలు చూపే విధంగా కలెక్టర్లకు సర్క్యులర్లు ఇవ్వాలని మంత్రులు కోరారు. గిరిజన ప్రాంతాల్లో పీటీజీలకు కనీసం 150 రోజుల పనికల్పించే విధంగా కేంద్రాన్ని కోరాలన్నారు.

కేంద్రం కావాలని తెలంగాణ మీద కక్ష కట్టి ఉపాధి హామీ పథకంలో నిబంధనలు పెట్టిందని, మిగిలిన రాష్ట్రాల్లో ఈ నిబంధనలు పాటించకున్నా నిధులు విడుదల చేస్తూ మన దగ్గర మాత్రం ఆపుతున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

రైతు కల్లాలు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు అభ్యంతరం చెప్పకుండా కల్లాలు పూర్తి చేసిన తర్వాత ఉపాధి హామీ పథకంలో లోపాలు వెతికే పనిలో కల్లాల నిర్మాణాన్ని తప్పు పట్టారని వివరించారు.
కల్లాల కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, తెలంగాణకు రావల్సిన 800 కోట్ల రూపాయలను 10 నెలలుగా ఆపారని చెప్పారు. కల్లాల ఖర్చు మేమే భరిస్తామని, ఆ డబ్బులు మినహాయించుకుని మిగిలిన నిధులు విడుదల చేయమంటే ఇటీవలే 276 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. ఇంకా 250 కోట్లకు పైగా నిధులు రావల్సి ఉందన్నారు.

ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో జరుగుతున్న పనుల్లో 61 శాతం మంది మహిళలు పనిదినాలు పొందుతున్నారన్నారు. అదేవిధంగా ఎస్సీలు 21.66శాతం, ఎస్టీలు 20.3 శాతం ఉన్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 1.06 మంది కూలీలకు జాబ్ కార్డులున్నాయని, వందశాతం కేంద్రం ఇచ్చే పనులన్నీ వినియోగించుకుంటున్నామన్నారు.

ఉపాధి హామీలో ఈ ఆర్ధిక సంవత్సరంలో 3135.7 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు తెలిపారు. గతం నుంచి కొనసాగుతున్న ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రాగా సాఫ్ట్ వేర్ మార్చి అలవికానీ నిబంధనలతో నరేగ సాఫ్ట్ వేర్ తెచ్చారన్నారు. దీనివల్ల ఇప్పుడు ఉపాధి హామీ పనులు జరిగే టీమ్స్ వద్దకు వెళ్లి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసి కేంద్రానికి పంపాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా పనిముందు, పనిజరిగేటప్పుడు, పని తర్వాత ఫోటోలు తీయాలన్ననిబంధన పెట్టారన్నారు.

Leave A Reply

Your email address will not be published.