435 సార్లు భూప్రకంపనలు.. 8వేలు దాటిన మృతుల సంఖ్య.. !

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తుర్కియే, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అత్యంత శక్తివంతమైన భూకంపం ధాటికి ఆ ప్రాంతాలు శవాల దిబ్బగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మృత్యు ఘోషే వినిపిస్తోంది. శిథిలాల నుంచి వేలాది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. ఈ భారీ ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు 8,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 వేల మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘోర విపత్తులో 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేస్తోంది.

435 సార్లు కంపించిన భూమి..

సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో మొదటిసారి భూమి కంపించగా.. ఈ రెండు రోజుల్లోనే ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఈ ఘోర విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద వేలాది మంది మృతదేహాలు ఉండొచ్చని అంటున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న లక్షల మంది..

భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద 1,80,000 మంది చిక్కుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులుగా 25 వేల మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు తీవ్రమైన చలికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూలిన భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. 25 వేల మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగి.. శిథిలాల కింద చిక్కుకొన్న వారి కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులతో అక్కడ ఆసుపత్రులు నిండిపోయాయి. వైద్య సిబ్బంది అవిశ్రాతంగా పనిచేస్తున్నారని సిరియాకు చెందిన డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ మిషన్‌ హెడ్‌ సెబాస్టియన్‌ పేర్కొన్నారు. సహాయక చర్యలు వాతావరణం అనుకూలించడం లేదని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

ప్రపంచ దేశాల చేయూత

ఈ ఘోర విపత్తు అనంతరం భారత్‌ సహా మొత్తం 70 దేశాలు తుర్కియే, సిరియా దేశాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్‌ మెటీరియల్‌ను తక్షణంగా ఆ దేశాలకు పంపించాయి.

Leave A Reply

Your email address will not be published.