సంస్థాగత నిర్మాణంపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సాధారణ ఎన్నికల ఏడాది కావడంతో కమలం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కాషాయ పార్టీ కసరత్తు కూడా ప్రారంభించింది. తెలంగాణ లో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం విజయవంతం కావడంతో ఇక్కడ కూడా అమలు చేయాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు తలపెట్టారు. 10 ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తర్వాత 119 నియోజకవర్గాల్లో పబ్లిక్ మీటింగ్స్ తర్వాత 10 ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీతో పాటు ఇతర జాతీయ నేతలను ఆహ్వానిస్తామని తెలంగాణ బీజేపీ చెబుతున్నారు. ఈనెల 25 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పల్లెలకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై చైతన్యం చేసేందుకు 10 నుంచి 25వ తేదీవరకు నియోజకవర్గంలో నిర్వహించనున్న స్ట్రీట్‌కార్నర్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది.

15 రోజుల్లో 11వేల వీధి సభలకు తెలంగాణ బీజేపీ ప్లాన్

15 రోజుల్లో 11వేల వీధి సభలకు తెలంగాణ బీజేపీ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. రేపు (శక్రవారం) నుంచి 15 రోజుల పాటు శక్తి కేంద్రాల పరిధిలో కార్నర్ మీటింగ్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 800 కార్నర్ మీటింగ్స్‌కు ప్రణాళికలు రచించారు. కూకట్‌పల్లిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రికిషన్‌రెడ్డి, సనత్‌నగర్‌లో ఎంపీ లక్ష్మణ్, ఉప్పల్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, వరంగల్ వెస్ట్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జగిత్యాలలో ఎంపీ అర్వింద్, మునుగోడులోచింతల రామచంద్రారెడ్డి, మహబూబ్‌నగర్‌లో డీకే ఆరుణ కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలపై నేతలు ప్రసంగించనున్నారు. రెండోదశలో మండలం యూనిట్‌గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు. మూడు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా బీజేపీ గుర్తించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది. జిల్లాస్థాయిలో బహిరంగసభలు పూర్తయిన తర్వాత క్లస్టర్‌ స్థాయిలో భారీ సభలు ఏర్పాటుచేయనుంది.

Leave A Reply

Your email address will not be published.