తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనిస్థాయిలో కొండకు ప్రవాహంలా యాత్రికులు చేరుకుంటున్నారు. తమిళ భక్తులు పవిత్రంగా భావించే పెరటాశి మాసం మూడవ శనివారాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు భక్తులు క్యూకట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. భక్తులకు యాత్రికుల సముదాయంలో విశ్రాంతి తీసుకునేందుకు టీటీడీ సదుపాయం కల్పించింది. గోగర్భం డ్యాం దగ్గర క్యూలైన్లను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రానికి శ్రీవారి ఆలయం నుంచి సుమారు ఐదారు కిలోమీటర్ల మేరకు సర్వదర్శన భక్తులతో క్యూలైన్‌ వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి నారాయణగిరి విశ్రాంతి భవనంలో వెనుకభాగంలోని రింగ్‌రోడ్డు మీదుగా గోగర్భం డ్యాం వరకు సర్వదర్శన భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. చిన్నపిల్లలువృద్ధులతో వచ్చిన భక్తులు క్యూలైన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలితీవ్రత కూడా అధికమైన క్రమంలో చాలామంది తిరుమల నుంచి దర్శనం చేసుకోకుండానే తిరుగు ప్రయాణమవుతున్నారు. రద్దీ బాగా పెరుగుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు క్యూలైన్‌ను మూసివేశారు.

Leave A Reply

Your email address will not be published.