కండిషన్‌లో లేని వెహికిల్ ను వదిలివెళితే.. తగులబెడుతా..

-   ప్రోటోకాల్ అధికారులకు  రాజాసింగ్ హెచ్చరిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్  నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం బైక్‌ పై వెళుతున్నారు. కండిషన్‌లో లేని తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని) ప్రగతి భవన్ వద్ద వదిలేశారు. దీంతో ప్రోటోకాల్ అధికారులు రాజాసింగ్ వాహనానికి రిపేర్ చేయించారు. వాహనాన్ని తీసుకువెళ్లమని రాజాసింగ్‌కు అధికారులు కబురు చేస్తున్నారు. అయితే పాత వాహనం తనకు వద్దని.. కొత్తది కాకపోయినా పర్లేదు కానీ.. కనీసం కండిషన్‌లో ఉన్న వెహికిల్ కావాలని రాజాసింగ్ అంటున్నారు. ఒకవేళ పాత వాహనాన్ని బలవంతంగా అధికారులు తన నివాసం వద్ద వదిలివెళితే.. ప్రగతి భవన్ దగ్గర వాహనాన్ని తగులబెడుతానని రాజాసింగ్ అధికారులకు హెచ్చరించారు. దీంతో వ్యవహారం ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ ప్రోటోకాల్ అధికారులుగా మారింది.

కాగా ‘బండి కాదు.. మొండి ఇది సాయం చేయండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం విషయంలో అభ్యర్థించారు. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజాసింగ్.. వినూత్న నిరసనకు తెరదీశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారును ప్రగతి భవన్ గేటు దగ్గర వదిలేశారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కూడా రాజాసింగ్ తన బుల్లెట్ బండిపై వెళ్లిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.