తెలుగుదేశం పార్టీ లోకి కన్నా లక్ష్మీనారాయణ

- ఈ నెల 23న ముహూర్తం ఫిక్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరులోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సీనియర్ నేత, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి జాబితాలో కూడా కన్నా పేరు వినిపించింది. అంతటి సీనియర్ నేత పరిస్థితులు, మారిన రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వచ్చారు. వచ్చీరాగానే ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీకి కూడా రాజీనామా చేసి తర్వాత ఏ పార్టీలో చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది.

కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కాపు రిజర్వషన్ల అంశం వచ్చినప్పుడు చంద్రబాబును పొగిడారు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ తీరుపై కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం అందుకున్న పార్టీ ఆయన్ని ఆహ్వానించడానికి క్యూ కట్టారు. అలా ఆహ్వానించిన పార్టీల్లో టీడీపీ, జనసేన, వైసీపీ ఉన్నాయి. ఆయన మాత్రం అన్ని అంచనాలు వేసుకున్న తర్వాత… అనుచరులతో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారని సన్నిహితులు చెబుతున్నారు.

ఇటీవల విశాఖలో  కాపు సంఘాల నేతృత్వంలో జరిగిన సమావేశంలో  జీవీఎల్ నరసింహారావుకు సన్మానం చేశారు. పార్లమెంట్‌లో కాపు రిజర్వేషన్ల అంశంపై జీవీఎల్ ఓ ప్రశ్న వేశారని  ఈ సన్మానం చేశారు.  కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది.  ఇక సర్టిఫికెట్లు జారీ చేయడమే మిగిలి ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రిజర్వేషన్లు చెల్లవని క్యాన్సిల్ చేసింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో జీవీఎల్ ఓ ప్రశ్న అడిగారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయా అని ప్రశ్నించారు. అవి చట్టబద్దంగానే ఉన్నాయని చెల్లుతాయని కేంద్రం సమాధానం ఇచ్చింది.  అలా తాను ప్రశ్న అడిగినందుకే ఆ సమాధానం వచ్చిందని జీవీఎల్ నరసింహారావు కాపు సంఘాలతో సన్మానాలు చేయించుకున్నారని  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఇది కన్నా లక్ష్మినారాయణకు కోపం తెప్పించిందని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.