ఏప్రిల్‌ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండో విడత గొర్రెల పంపిణీని ఏప్రిల్‌ నుంచి చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘ఎఫ్‌ఆర్‌బీఎం’ రుణ పరిమితి తేలిన తర్వాత ‘ఎన్‌సీడీసీ’(జాతీయ సహకార అభివృద్ధి సంస్థ) నుంచి ఎంత రుణం తీసుకోవాలి? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్‌సీడీసీ రూ.4,564 కోట్ల రుణం మంజూరు చేసింది. అయితే ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. కొన్ని నెలలుగా ఈ అంశం పెండింగ్‌లో ఉంది. అయితే రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్రప్రభుత్వం యూనిట్‌ ధరను పెంచింది. మొదటి విడతలో ఒక యూనిట్‌ ధర(20 గొర్రెలు, ఒక పొట్టేలు) రూ. 1.25 లక్షలు ఉండగా… రెండో విడతకు వచ్చేసరికి రూ. 1.75 లక్షలకు పెంచారు. ఇంకా మూడున్నర లక్షల మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా… ఇందుకు రూ. 6,125 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర పశుసంవర్థకశాఖ లెక్కలు వేసింది. ఇందులో రూ. 4,594 కోట్ల సబ్సిడీని రాష్ట్రప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 1,531 కోట్లు లబ్ధిదారులు తమ వాటాధనం కింద భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకుని, ఫిబ్రవరి, మార్చి నెలల్లో లోనింగ్‌ ప్రక్రియ పూర్తిచేసి… ఏప్రిల్‌ నెలలో గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల్లో ఇప్పటికే సగం మందికి గొర్రెలు పంపిణీచేయగా… మిగిలిన సగం మంది లబ్ధిదారులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.