వైసీపీలో షాడో ముఖ్యమంత్రి…?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నారు. ఆయన 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్నారు. ఆయన యువకుడు. సమర్ధుడు. ప్రజాదరణ ఉన్న వారు. ఇలాంటి జగన్ ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రి ఉన్నారా అంటే ఉన్నారు అని ప్రత్యర్ధులు ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆయనే సజ్జల రామక్రిష్ణారెడ్డి అని అంటున్నారు. ఆయన కేవలం ప్రభుత్వ సలహాదారు కదా అంటే కాదుట. ఆయన అసలైన అధికారాలను తన వైపు ఉంచుకుని మొత్తం అంతా చేస్తున్నారు అని అంటున్నారు.ఒకే రోజున ఇద్దరు నాయకులు సజ్జలనే టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేయడంతో సజ్జల మీద అందరి చూపూ వెళ్తోంది. పద్నాలుగేళ్ల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసి అంతేకాలం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు జగన్ని పక్కన పెట్టి మరీ సజ్జలను టార్గెట్ చేయడం అంటే ఆలోచించాల్సిందే. తనను అనపర్తిలో పోలీసులు అడ్డుకుని తన సభకు ఆటంకాలు కలిగించే కార్యక్రమం వెనక సజ్జల రామక్రిష్ణారెడ్డి డైరెక్షన్ ఉందని బాబు ఆరోపించారు.సజ్జల కనుసన్నలలోనే ఇదంతా జరిగింది అని బాబు అంటున్నారు. నిజానికి సజ్జల మంత్రి కారు. ఆ మాటకు వస్తే ఎమ్మెల్యే కూడా కారు. కానీ గతంలో ఆయన మీద వచ్చిన విమర్శలు చూస్తే షాడో హోం మంత్రి అనే వారు. కానీ ఇపుడు ఆయన్ని షాడో ముఖ్యమంత్రి అని అంటున్నారు. చంద్రబాబు ఈ రకంగా ఆరోపణలు చేసిన తరువాత నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు.

తన అనుచరులను ఇద్దరిని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఇదంతా తనను బలహీన పరచడానికి తన వారిని బెదిరించడానికి చేసే ప్రయత్నం అని మండిపడ్డారు. సజ్జల డైరెక్షన్ తోనే పోలీసులు ఇలా చేస్తున్నారు అని కోటం రెడ్డి కూడా ఆరోపించారు. ఆయన షాడో సీఎం గా తయారు అయ్యారని కూడా నిందించారు.నిజానికి వైసీపీలో సజ్జల కేవలం ప్రభుత్వ సలహాదరుగా ఉన్నా ఆయన్ని సకల శాఖల మంత్రిగా చాలా మంది అంటూ ఉంటారు. ఆయన ప్రభుత్వంలో ఎన్నో నంబర్ గా ఉన్నారో తెలియదు కానీ జగన్ కి అధికార ప్రతినిధి అని కూడా అంటారు. జగన్ మనసులో మాటనే సజ్జల చెబుతారు అని కూడా ప్రచారంలో ఉంది.అయితే ఇపుడు విపక్షాల విమర్శలు చూస్తూ ఉంటే సజ్జల అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అన్న అర్ధం వస్తోంది. మరి సజ్జలకు అంత స్వేచ్చ ప్రభుత్వంలో ఉందా. ఉంటే కనుక జగన్ వంటి బలమైన నాయకుడు ఆయన్ని అంత ఫ్రీగా వదిలేశారా. ప్రభుత్వానికి సజ్జల చేసే కార్యక్రమాలు బాగా ఉన్నట్లుగా ఉన్నాయా అన్నది కూడా చర్చకు వస్తోంది.వైసీపీలో కూడా సజ్జల మీద పార్టీ వారే గుసగుసలు పోతున్నారని అంటారు. ఆయన సీఎం కి తమకూ మధ్య ఎడం పెడుతున్నారని అంటారు. ఇదే మాటను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని విడిచి పెడుతూ చేశారు. సజ్జల వల్లనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలలో నిజానికి నంబర్ టూలు ఎవరూ ఉండరు ఉంటే ఏమిటి జరుగుతుందో ఎంటీయార్ జమానాలో జరిగిన రెండు వెన్ను పోట్లు తెలియచేశాయి.అన్నీ తెలిసి వైసీపీ నంబర్ టూలను రెడీ చేస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఏది ఏమైనా వైసీపీలో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమి జరిగినా సజ్జల టార్గెట్ అవుతున్నారు. నిజంగా అక్కడ అంత సన్నివేశం ఉందా అన్న వారూ ఉన్నారు. జగనే వన్ టూ టెన్ గా పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఉంటారు కానీ ఆయన మాటగా ఎవరైనా ముందుకు వస్తే వారు టార్గెట్ అవుతున్నారా అన్న చర్చ కూడా ఉంది.ఏది ఏమైనా సజ్జల మీద అందరి కళ్ళూ ఉన్నాయి. ఆయనకు రాజకీయ దిష్టి బాగా తగులుతోంది. మరి ఆయన తన అధికారాలను మించి యాక్షన్ చేస్తే ఏ దిష్టీ అవసరం లేదు లేకపోతే మాత్రం ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.