రేపటి నుండి యాదాద్రి నర్సన్న బ్రహ్మోత్సవాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునర్నిర్మించిన యాదాద్రి ఆలయంలో.. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ( రేపు ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అలంకరణ కోసం మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన చాట్ల ప్యాట్నీ సెంటర్‌ యాజమాన్యం పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా.. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి తిరు కల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.