భారత రైతాంగానికి ఊపిరి ‘తెలంగాణ రైతుబంధు’

  -భారత సుదర్శన్, విశ్లేషకులు & సీనియర్ జర్నలిస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వ్యవసాయమే ప్రధానంగా గల మన భారతదేశంలో భిన్న భౌగోళిక పరిస్థితులు, విభిన్న వాతావరణాలు ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలో నెలవైన తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఎంతో ప్రత్యేకతతో కూడుకొని ఉంటుంది. వైవిధ్యభరితమైన పంటలతో శతాబ్ధాలపాటు కొనసాగిన తెలంగాణ వ్యవసాయాన్ని స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత లుగా తెలుసుకోవాలి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్ధేశపూర్వకంగా విధ్వంసానికి గురైన ఇక్కడి వ్యవసాయం..ఉద్యమ నాయకుడే పాలకుడుగా వచ్చిన సీఎం కేసీఆర్ దేశంలోనే తెలంగాణ వ్యవసాయాన్ని ఒక మోడల్ గా తీర్చిదిద్దిన విధానం అబ్బురపరుస్తున్నది. గత ఎనిమిదిన్నరేండ్ల కేసీఆర్ సుపరిపాలనలో వ్యవసాయ రంగంలో అనేక అభివృద్ధి, సంక్షేమ సృజనాత్మక పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతం చేయడం జరిగింది. ఫలితంగా దేశంలోనే తెలంగాణ వ్యవసాయ రంగం మోడల్ గా నిలవడం అందరికీ గర్వకారణం.

డెబ్బయి అయిదు వసంతాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65 వేలకోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయం కింద అందించిన ఒకే ఒక ప్రభుత్వం సీఎం కేసీఆర్  తెలంగాణ ప్రభుత్వం. 2018 మే 10 న కరీంనగర్ లోని శాలపల్లి – ఇందిరానగర్ లో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికిచ్చే నిధుల్లో కోత పెట్టినా, ఎఫ్.ఆర్.బి.ఎం నిధులను తగ్గించినా ‘రైతుబంధు’ను ప్రభుత్వం నిరాటంకంగా అందించింది. తెలంగాణలో దాదాపు 58 లక్షల మంది రైతు బంధు ద్వారా లబ్ధిపొందుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లోనూ అమలు :

‘తెలంగాణ రైతుబంధు’ పథకాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తున్నాయి. ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రైతుబంధును ఆయా ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాయి. ఒడిశాలో ‘కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్ కమ్ అగ్మెంటేషన్ (కాలియా)’ పేరుతు రైతు బంధు ఇస్తున్నారు.  ఒడిశా రాష్ట్రంలో ‘కాలియా’ పేరుతో రైతుబంధు పథకాన్ని 30 లక్షల మంది చిన్న, సన్నాకారు రైతులకు వర్తింపజేస్తున్నారు. రెండు విడతలుగా ఏటా రూ.10 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలో ‘ముఖ్యమంత్రి కృషి యోజన పథకం’ కింద రైతు బంధును అమలు చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.5 వేల చొప్పున అందజేస్తున్నది. పశ్చిమ బెంగాల్ లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ‘వైఎస్సార్ రైతు భరోసా పథకం’ పేరుతో అమలు చేస్తున్నారు. ఇంకా అనేక రాష్ట్రాలు ‘రైతు బంధు’ను అమలు చేసేందుకు తీవ్ర కసరత్తను చేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వమూ రైతుబంధు దారిలోనే :

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ‘రైతు బంధు పథకం’ ను కాపీ కొట్టి పీఎం-కిసాన్ పథకం (ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’) 2019లో ప్రకటించింది. పీఎం కిసాన్ ద్వారా 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి కేవలం రూ.6 వేలను మూడు విడతల్లో ఇస్తున్నది. పీఎం కిసాన్ పథకానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు అందిస్తున్న ‘రైతు బంధు’ పథకమే స్ఫూర్తిగా నిలవడం దేశ చరిత్రలో గర్వించదగిన అంశం.

సీఎం కేసీఆర్ అందిస్తున్న ‘రైతు బంధు పథకం’పై అంతర్జాతీయ, జాతీయ ప్రశంసలు ఎన్నో వచ్చాయి. రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒకటిగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. మద్ధతు ధర, రుణమాఫీకి బదులుగా రైతులకు పెట్టుబడి సహాయం అందించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. తెలంగాణలో రైతుబంధు పథకం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈ పథకం రైతుల ఆదాయానికి ఒక భరోసా ఇస్తుందని, వారి ఆర్థిక, సామాజకి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది’’ అని కేంద్ర ఆర్థిక మండలి మాజీ సెక్రటరీ అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో ఆచరించదగినదని, దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయపడ్డారు. ఎండనకా, వాననకా ఆరుగాలం కష్టపడే రైతన్న కష్టాన్ని స్వతంత్ర భారతంలో ఏ ముఖ్యమంత్రీ గానీ, యే ప్రధానమంత్రి గానీ మనసు పెట్టి గుర్తించిన దాఖలాలు లేవు. కేవలం ఓటు బ్యాంకు కోసమే కంటితుడుపు పథకాలను ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్న సర్కార్లు అనేకం ఉన్నాయి. మొట్టమొదటిసారిగా అతిచిన్న కాలంలోనే తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజా ఉద్యమ నాయకుడు, గొప్ప సంస్కరణశీలి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ’రైతుబంధు’ అనే సృజనాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి భారత రైతాంగ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఇది భారతజాతి జనుల ఆత్మగౌరవ నినాదంగా రూపుదిద్దుకొని దేశంలోనే గొప్ప సామాజిక, ఆర్థిక విప్లవంగా మారుతూ భారత దేశాన్ని ప్రపంచంలోనే సూపర్ పవర్ గా నిలుపబోతున్నదనటలో అతిశయోక్తి లేదు.

        -భారత సుదర్శన్, విశ్లేషకులు & సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.