డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్.. ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డీఎంకే అధ్యక్షుడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి ఎన్నికయ్యారు. పార్టీ నేతలు, శ్రేణులు ఆయనను రెండోసారి డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. ఆదివారం ఉదయం చెన్నైలో డీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ను ఎన్నుకున్నారు. శుక్రవారం డీఎంకే అధ్యక్ష పదవికి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. పోటీగా ఎవరూ నామినేషన్ వేయలేదు. నేతలందరి మద్దతుతో డీఎంకే అధ్యక్షుడిగా రెండోసారి స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఆ పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటన జారీ చేశాయి. ఇక డీఎంకే జనరల్ సెక్రటరీ దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు రెండోసారి ఆ పదవులకు ఎన్నికయ్యారు. ఇటీవలే డీఎంకే పార్టీలో 15వ సంస్ధాగత ఎన్నికలు జరగ్గా.. పార్టీలోని వివిధ పదవులను భర్తీ చేశారు. వివిధ విభాగాల పదవులను భర్తీ చేసిన తర్వాత ముఖ్యమైన అధ్యక్ష, జనరల్ సెకట్రరీ, కోశాధికారి పదవులకు నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2018లో తన తండ్రి కరుణానిధి మరణానంతరం డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ను నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు రెండోసారి మళ్లీ ఆయననే అధ్యక్షుడిగా డీఎంకే నేతలు ఎన్నుకున్నారు. 1949లో డీఎంకే పార్టీని సిఎన్ అన్నాదురై స్థాపించారు. 1969లో ఆయన మరణించేంతవరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత 1969 నుంచి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను కరుణానిధి ప్రారంభించారు.. డీఎంకే తొలి అధ్యక్షుడితో పాటు మరణించే వరకు కరుణానిధి అధ్యక్షుడిగా కొనసాగారు.

Leave A Reply

Your email address will not be published.