మలయాళ నటి, టీవీ యాంకర్ సుబీ సురేష్ మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చిత్ర పరిశ్రమ ఈ రెండు నెలల కాలంలో పలువురు ప్రముఖులను కోల్పోయింది. ఇదే నెలలో కళాతపస్వి విశ్వనాథ్‌‌తో పాటు నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఈ సంఘటనలు మరవకముందే మలయాళ నటి, టీవీ యాంకర్ సుబీ సురేష్ (Subi Suresh) బుధవారం (ఫిబ్రవరి 22న) మరణించింది. ఆమె వయసు 42 ఏళ్లు కాగా.. కొద్ది రోజుల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జనవరి 28న సుబీని అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో చేర్చగా.. కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నందున చికిత్స కష్టంగా ఉందని అంతకుముందు ఆమె సన్నిహితురాలు చెప్పారు.

సుబీ సురేష్ చాలా ఏళ్ల కిందట ఏసియానెట్‌లో ప్రసారమైన ‘సినీమాల’ అనే కామెడీ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. మిమిక్రీతో పాటు తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలోనే ‘కనకసింహాసనం, కార్యస్థానం, హ్యాపీ హస్బెండ్స్, ఎల్సమ్మ ఎన్న ఆంకుట్టి, పచ్చకుతీర తదితర మలయాళ చిత్రాల్లో నటించింది. అలాగే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’, ‘కుట్టి పట్టాలం’ వంటి షోస్ హోస్టింగ్ తనకు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే గత 15 రోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. కాలేయ దాత కోసం ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని కోస్టార్ రమేష్ పిషారోడి ఏసియా నెట్‌తో తెలిపారు. కామెడీ ఫీల్డ్‌లో ఆమె ఏకైక మహిళా యోధురాలని, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 20 ఏళ్లుగా కష్టపడిందని చెప్పారు. తన అనారోగ్యం గురించి తెలుసుకునే సమయానికి అది చివరి దశలో ఉందని.. చాలా మంది వ్యక్తుల సహాయంతో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసినప్పటికీ రక్తపోటు అధికం కావడంతో డాక్టర్లు ఆగిపోయారని, ఇంతలోనే చనిపోయిందని తెలిపారు. ఆమె మంచి డాన్సర్ అని కూడా గుర్తుచేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.