అంబర్‌పేట్‌లో కుక్కల దాడి ఘటన పై హెచ్ ఆర్ సి కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరంలోని అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో బాలుడి మరణంపై హ్యూమన్ రైట్స్ కమీషన్‌ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పై కేసు పెట్టాలని హెచ్‌ఆర్సీని కోరారు. ఈ సందర్భంగా షేమ్ కేటీఆర్, షేమ్ మేయర్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ – కార్ రేస్ మీద ఉన్న దృష్టి.. మున్సిపల్ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక కేటీఆర్‌ కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని.. మేయర్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఆర్‌సీకి జడ్జి లేక రెండు నెలలు అవుతున్నా.. జడ్జిని నియమించడం లేదని మహేష్‌ కుమార్ అన్నారు. అననతరం పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ… గద్వాల విజయలక్ష్మి మేయర్ పదవికి అనర్హురాలన్నారు. కేటీఆర్‌కు ఎలక్షన్ మీద ఉన్న దృష్టి.. ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఆర్‌సీలో ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయన్నారు. కుక్క చనిపోతే కేసును నమోదు చేస్తారని…అదే కుక్క మనిషిని కరిస్తే కేసు నమోదు చేయరా అని ప్రశ్నించారు. బాలుడి మరణానికి కారణం అయిన వారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు. గత సంవత్సరం 80 వేల మంది కుక్క కాటుకు గురయ్యారని తెలిపారు. ‘‘కేటీఆర్ గచ్చిబౌలి, కోకపేట్‌‌ను చూపించి ఇదే అభివృద్ధి అంటున్నారు… కేటీఆర్ నాతో రా సమస్యలు ఎన్నిన్నాయో చూపిస్తా’’ అని అన్నారు. సమస్య వస్తేనే జీహెచ్‌ఎంసీ గుర్తు వస్తుందా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కూతూరో, కోడుకో ఆ బాలుడు స్థానంలో ఉంటే.. ఇదే విధంగా చూస్తూ ఊరుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మరో కాంగ్రెస్ నేత కోట నీలిమ డిమాండ్ చేశారు. మరణించిన బాలుడి కుటుంబానికి భరోసా ఏది అంటూ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.