భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిరాదరణకు గురైన ఆలయాల పునరుద్ధణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌ రేకుర్తిలో నిర్మిస్తున్న లక్ష్మి నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని వెల్లడించారు.
ఈ నెల 24న స్వామి వారి ఆలయానికి గోపుర గడప నిర్మాణం చేపడుతున్నామన్నారు.నెలన్నర రోజుల్లోగా పనులు పూర్తి చేసి స్వామి వారి దర్శనానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాదగిరిగుట్టను సౌత్ ఇండియాలోనే గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. కొండగట్టు ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ రేకుర్తిలోని గుట్ట పై స్వయంభువుగా వెలిసిన లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో స్వామి వారు శంఖు ,సుదర్శన చక్రాలతో స్వయంభువుగా వెలిసిన మహిమాన్వితమైన ఆలయమన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు రూ. 20 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు ఆలయాన్ని నిర్మించామన్నారు. మంత్రి వెంట నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.