బీఎంఎస్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

- తెలంగాణకు మరో రూ.800 కోట్ల పెట్టుబడి.. -   1500 మంది యువతకు ఉద్యోగావకాశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరం బయోటెక్నాలజీ ఐటీ కి గొప్ప ఆకర్షణీయ గమ్య స్థానంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఎంఎస్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ ఫార్మాసుటికల్‌ కంపెనీల్లో బీఎంఎస్‌ ఒకటి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ‘హైదరాబాద్‌ నగరం బయోటెక్నాలజీ ఐటీ కి గొప్ప ఆకర్షణీయ గమ్య స్థానంగా ఉంది. బీఎంఎస్‌ కూడా ఈ రెండు రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్‌ నగరంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యం వారి (బీఎంఎస్‌) కార్యకలాపాలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా. 2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్‌ సైన్సెస్‌ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ రోజు బీఎంఎస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశం’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.ఎంఓయూ ద్వారా 1,500 మందిని నియమించుకుంటామన్న బీఎంఎస్‌ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మం తమకు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం సందర్భంగా హైదరాబాద్‌ ఫార్మాసిటీలో ఉన్న అవకాశాల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు.హైదరాబాద్‌ నగరం గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని బీఎంఎస్‌ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐదేండ్ల కిందట తాము హైదరాబాద్‌ వచ్చినప్పుడు పరిస్థితి గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మౌలిక వసతుల విషయంలో నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. రానున్న మూడు సంవత్సరాల్లో తమ కంపెనీ సుమారు 1500 మంది ఉద్యోగులను నియమించుకుంటుందని.. 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తమ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతోందని వారు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.