బాన్సువాడ లో చైన్ స్నాచింగ్ కు విఫలయత్నం

.. దుండగుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
గొలుసు దొంగతనానికి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించిన ఘటన బాన్సువాడ పట్టణ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని జండా గల్లి కాలనీకి చెందిన కొత్త అశోక్ సతీమణి పూజ కోసం పువ్వులను కోస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలో నుండి బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు దుండగున్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. దొంగను విచారించిన పోలీసులు ఇతను హైదరాబాద్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించారు ఇతనిపై గతంలో పలు కేసులు నమోదైనట్లు వారు వెల్లడించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో పట్టణం వాసులు ఉలిక్కిపడ్డారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.