రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు

- ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ భేటి

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌ లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపు, జీవో 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్, వక్ఫ్ భూములు తదితరాల అమలుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు.మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్‌ మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇతర అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాంతో కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2014 సంవత్సరంలో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు.జీవో 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని సబ్‌ కమిటీ అధికారులను ఆదేశించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. నోటరీ చేసిన పత్రాలపై ప్రస్తావిస్తూ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల ప్రక్రియను, సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. పేదలకు అనుకూలమైన విధానాన్ని తీసుకోవాలని, అర్హత ఉన్న అన్ని కేసులను త్వరగా పూర్తి చేయాలని కమిటీ అధికారులకు సూచించింది.

Leave A Reply

Your email address will not be published.