ధర్నా చేస్తే రూ.20వేలు ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్‌ రద్దు..!

-  జేఎన్‌యూ కీలక నిర్ణయం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూనివర్సిటీలో అనధికారిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షను అమలు చేయనుంది. వర్సిటీ ప్రాంగణంలో ధర్నాలు చేసే విద్యార్థులపై రూ. 20 వేల నుంచి రూ. 30 వేల జరిమానా విధించనుంది. అదేవిధంగా హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు చేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది.ఈ మేరకు 10 పేజీల ‘విద్యార్థుల క్రమశిక్షణ- ప్రవర్తన నియమావళి’ని జేఎన్‌యూ విడుదల చేసింది. ఇందులో ధర్నాలు, ఫోర్జరీ వంటి వివిధ రకాల చర్యలకు శిక్షలు, విచారణ ప్రక్రియలను నిర్దేశించింది. ఈ కొత్త రూల్స్‌ ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. గుజరాత్ అల్లర్ల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనపై విశ్వవిద్యాలయంలో ఇటీవల గొడవలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని జేఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది.తాజా నిబంధనలు విశ్వవిద్యాలయంలోని అందరికీ వర్తిస్తాయని నోటీసుల్లో పేర్కొంది. జేఎన్‌యూ ప్రాంగణంలో జూదం ఆడటం, హాస్టల్ గదులను అనధికారికంగా ఆక్రమించడం, దుర్వినియోగం, అవమానకరమైన పదజాలం, ఫోర్జరీ వంటి 17 నేరాలకు విధించే శిక్షలను ఇందులో పొందుపరిచింది. ఫిర్యాదుల కాపీని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పంపుతామని నిబంధనలలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.