చైనా, పాక్‌ల నుంచి భారత్ భద్రతకు ముప్పు

- అమెరికన్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాకిస్థాన్, చైనాలతో భారత దేశ సంబంధాల్లో ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 2020లో గాల్వన్‌ లో జరిగిన ఘర్షణ పరిస్థితులు కొనసాగుతాయని, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు కశ్మీరులో హింసాత్మక చర్యలకు పాల్పడితే, పాక్‌‌పై భారత దేశం ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని అంచనా వేసింది. వార్షిక ముప్పు అంచనా నివేదికలో అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ చైనా భారత దేశం మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితుల్లో అమెరికా తక్షణమే దృష్టి సారించవలసిన అవసరం ఏర్పడవచ్చునని ఈ నివేదిక పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేటి కాలపు యుద్ధ లక్షణాలను నిర్వచించే యుద్ధమని చెప్తూ, అంతర్జాతీయ నిబంధనలను మార్చడం, పొరుగు దేశాలను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతూ, నిబంధనల ఆధారిత ప్రపంచ పరిస్థితులను మార్చే సామర్థ్యం చైనాకు ఉందని తెలిపింది. వివాదాస్పద సరిహద్దుల వెంబడి భారత్, చైనా తమ తమ సైన్యాలను పెద్ద ఎత్తున మోహరించిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అణ్వాయుధ సామర్థ్యంగల ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. దీనివల్ల అమెరికన్లకు, అమెరికా ప్రయోజనాలకు ప్రత్యక్ష ముప్పు ఉండే అవకాశం ఉందని, ఫలితంగా అమెరికా జోక్యం అవసరమవుతుందని పేర్కొంది.ఉగ్రవాదులకు మద్దతివ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సైనిక బల ప్రయోగానికి దిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీరులో అశాంతిని, హింసను సృష్టించినా; భారత దేశంలో ఉగ్రవాద దాడి జరిగినా మోదీ ప్రభుత్వం పాకిస్థాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉందని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.